హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై అధ్యయనం కోసం ఈ నెల 3 (సోమవారం)న నిపుణుల బృందాలు రానున్నాయి. మేడిగడ్డ అధ్యయనం కోసం రూ.2కోట్లు కావాలని నీటిపారుదల శాఖకు సీఎస్ఎమ్ఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) ప్రతిపాదనలు పంపింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో సీపేజీలు, పనితీరు పరిశీలన కోసం ఒక్కోదానికి రూ.కోటి మేర ఖర్చవుతుందని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) అంచనా వేసింది.
బరాజ్‌ల పరిస్థితిపై పరిశోధనలు, పరీక్షలను సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ హైదరాబాద్ వంటి సంస్థలతో చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆయా సంస్థలను సంప్రదించింది. ఇప్పటికే సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం బరాజ్‌లను పరిశీలించి, నీటిపారుదల అధికారులతో భేటీ అయి చేపట్టాల్సిన పనులపై చర్చించింది. పనులకు ఎంత ఖర్చవుతుందో తెలుపుతూ రెండు సంస్థలు నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపాయి. రెండు సంస్థల నిపుణులు 3 నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఈనెల 10 లేదా 12 నాటికి తాత్కాలిక పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 20, 21 రెండు గేట్లలో ఇప్పటికే 20వ గేట్‌ను తొలగించారు. 21వ గేట్‌ను ఎత్తే అవకాశముందని భావిస్తున్నారు. 7వ బ్లాక్ కింద బొయ్యారాన్ని గ్రౌటింగ్ చేస్తున్నారు. తీవ్ర ఎండల కారణంగా పనిప్రదేశంలో ఇంజినీర్లు, కార్మికులకు సౌకర్యాలు కల్పించారు. ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు.