హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా స్కూల్, కాలేజీల బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీని ఆర్టీఏ అధికారులు శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఫిట్నెస్ లేని 39 స్కూల్ బస్సులను సీజ్ చేసి, జరిమానా విధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఫిట్నెస్ లేని, పన్ను చెల్లించని 34 బస్సులు, జగిత్యాల జిల్లాలో మూడు బస్సులు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో రెండు స్కూల్ బస్సులను సీజ్ చేసి జరిమానా విధించారు. పదిహేనేండ్లు దాటిన ఫిట్నెస్ లేని విద్యాసంస్థల బస్సులను ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పొద్దని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు.