జాతీయస్థాయిలో తెలంగాణ విద్యార్థుల సత్తా
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : విద్యార్థుల్లోని నైపుణ్యతలు, పరిశోధన ఆకాంక్షలను వెలికితీసేందుకు ప్రతిఏటా నిర్వహించే ఇన్స్పైర్-మానక్ జాతీయ ఎగ్జిబిషన్‌కు తెలంగాణ నుంచి 37 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2020-21 సంవత్సరానికి నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో గెలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను జనవరి 27, 28 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించారు. ఈ పోటీల్లో 33 జిల్లాలకు చెందిన 360కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో నుంచి ప్రతిభావంతులైన 37 మందిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికచేశారు. జాతీయస్థాయి ఎగ్జిబిషన్‌ను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్- గుజరాత్ నిర్వహించనుండగా, జాతీయ పోటీల తేదీలను ఇప్పటివరకు వెల్లడించలేదు. జాతీయస్థాయి పోటీలు సైతం వర్చువల్‌గానే జరుగనుండగా, విద్యార్థులంతా ఆన్లైన్లోనే పాల్గొంటారని అధికారులు తెలిపారు.