హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ అసైన్డ్ భూములు ఇస్తామని వాటి యజమానులు ముందుకు వచ్చారు. శుక్రవారం భూ యజమానుల ప్రతినిధి బృందం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు లేఖ అందజేసింది. హైదరాబాద్ శివారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి మండలంలో 336 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. సర్వే నంబర్ 63/2, 63/25 లలోని 336 ఎకరాలను వ్యవసాయం కోసం 61 దళిత కుటుంబాలకు 5.18 ఎకరాల చొప్పున 1959 అక్టోబర్ 24న అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారి జనాభా పెరిగిందని, ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌కు తమకు కేటాయించిన 336 ఎకరాలను అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్లో ఈ భూములు అందించినందుకు, తమ కుటుంబాలకు ఒక్కో ఎకరానికి 500 గజాల చొప్పున ప్లాట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పత్రాన్ని సీఎస్‌కు అందజేశారు. సీఎస్‌ను కలిసినవారిలో 61 కుటుంబాల ప్రతినిధుల బృందం నాయకులు చినింగల్ల ఎల్లయ్య, మీసాల కృష్ణ, చీరాల నర్సింహ, మీసాల యాదగిరి, రాపోలు శంకరయ్య, నారాయణ, కామంగుల కుమార్, మాజీ జడ్పీటీసీ సంజీవరెడ్డి ఉన్నారు.