సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో మొదటి పీజీ బ్యాచ్ (2022-23) జీజీ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో మంత్రి హారీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది యంగ్ మెడికల్ కాలేజ్ అని పేర్కొన్నారు. ఉస్మానియా లాంటి కాలేజీలకే సంవత్సరానికి మూడు లేదా నాలుగు పీజీ సీట్లు వస్తాయి. కానీ మొదటి సంవత్సరంలోనే సిద్దిపేట మెడికల్ కాలేజీకి రికార్డ్ స్థాయిలో 57 పీజీ సీట్లు సాధించామని గుర్తు చేశారు. పీజీ మెడికల్ సీట్ల సాధనలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ల కృషి చాలా ఉందని ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు తెలంగాణ ప్రాంతంలో 2,950 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండగా, తెలంగాణ సాధించిన ఈ ఏదేండ్ల కాలంలో 6,715 సీట్లకు పెంచుకున్నామని తెలిపారు. ఇది 127 శాతం పెరుగుదల అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 1180 పీజీ సీట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2501కి చేరిందన్నారు. రాష్ట్రం ఏర్పాడే నాటికీ 5 మెడికల్ కాలేజీలు ఉండగా ఈ ఒక్క సంవత్సరమే 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 17 ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాము. వచ్చే సంవత్సరం మరో 9 కాలేజీలను ప్రారంభిస్తాము. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మల్టీ స్పెషాలిటీ కోర్సుల సీట్ల సంఖ్యను పెంచుతామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీలలో ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీల కొరత ఉంది. గుర్తుతెలియని వ్యక్తుల డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలలో ఉపయోగించరాదని చట్టంలో చెప్తున్నందున దాని పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు.
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి పీజీ బ్యాచ్ మీది కాబట్టి చరిత్రలో నిలిచేలా అందరూ డిస్టింక్షన్ సాధించి రాబోవు తరాల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని హరీశ్‌రావు సూచించారు. అన్ని రంగాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్న మాదిరిగానే వైద్య విద్యలో కూడా జాతీయస్థాయిలో రోల్ మోడల్ గా నిలపాలన్నారు. కాలేజీలో ర్యాగింగ్ చేయకుండా జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలి. వారు వైద్య విద్యలో విజయవంతంగా రాణించేలా సలహాలు ఇవ్వాలని హరీశ్‌రావు సూచించారు.