హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధా న్యం కలిగిన సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్తెసరు నిధులనే కేటాయించిం ది. మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించింది రూ.32.22 కోట్లు మాత్రమే. ఇదిలా ఉంటే గత బడ్జెట్లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయించగా, ఈసారి ఒక్క పైసా కేటాయించలేదు. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.1765 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2685 కోట్లు కేటాయించింది. సాగునీటి బడ్జెట్లో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకే ప్రభు త్వం పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఆర్డీఎస్ లింక్ కెనాల్ తదితర ప్రాజెక్టు పనులకు నిధులను కేటాయించింది. ఇక నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, దిండి, మూసీ, ఖమ్మం జిల్లాలో సీతారామ, వైరాకు భారీగా నిధులను కేటాయించింది. దేవాదుల, వరద కాలువ, వంటి పలు ప్రాజెక్టులకు కొద్దిమేర నిధులను విదిల్చింది. చనాక కొరాట, నీల్వాయి, మత్తడి, ర్యాలివాగు, జగన్నాథ్‌పూర్, కాళేశ్వరం, నిజాంసాగర్ ఆధునికీకరణకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది.