కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 7: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్‌పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా వార్డెన్ ఉమారాణి వారిని సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వెంటవెంటనే చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు 23 మందిని, మిగతా 8 మంది సాయంత్రం డిశ్చార్జి చేశారు. అదనపు కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులు బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. ఇది ఫుడ్పాయిజ్ కాదని, అరగకపోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు అధికారులు పేర్కొన్నారు.
ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్వీతోపాటు ఇతర విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు గురుకులానికి చేరుకుని ఆందోళనకు దిగాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని, బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హాస్టల్‌కు వచ్చిన అదనపు కలెక్టర్ స్పష్టం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. పోలీసులు చొరవ తీసుకొని బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి అంజలితో వివరణ ఇప్పించగా ఆందోళన విరమించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిం చి, బాధ్యులైన అధికారులు, సిబ్బంది, గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.