హైదరాబాద్, జూలై 23 : రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 33 స్పెషాలిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 309 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. సర్కార్ ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ప్రశంసించింది. ఒక్క సీటుకు కూడా కోత పెట్టకుండా, ఒక్క రూపాయి జరిమానా విధించకుండా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు కొనసాగిస్తున్నట్టు ఎన్ఎంసీ వెల్లడించింది.