TSCAB | హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని డీసీసీబీ, పీఏసీఎస్‌ల్లో 30 వేల మంది అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) వెల్లడించింది. ఆధార్‌కార్డుల్లో తప్పులు, ఇతర సమస్యల కారణంగా ఇది జరిగిందని తెలిపారు. దీంతో పాటు మరో 3982 మంది అర్హులైన రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో చేర్చకపోవడంతో వారికి కూడా రుణమాఫీ కాలేదని వెల్లడించారు. బుధవారం వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ‘ప్యాక్స్‌లో రుణమాఫీ జాబితా తప్పులతడక, గందరగోళం.’ కథనాలపై బ్యాంకు అధికారులు పత్రిక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. రుణమాఫీలో ప్యాక్స్‌లో తప్పులు జరిగిటనట్టు అధికారులు అంగీకరించారు.
ఈ విషయాలను ముందుగానే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రైతుల పేర్లను జాబితాలో చేర్చని 157మంది పీఏసీఎస్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా వివరించారు. తాము రుణమాఫీ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీకి ప్రభుత్వం నుంచి విడుదలైన మొత్తాన్ని డీసీసీబీలకు పంపించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని సూచించినట్టుగా తెలిపారు.