రామగిరి, అక్టోబర్ 26: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట పోస్టాఫీసులో డిపాజిట్లు గల్లంతైన ఘటన వెలుగుచూసింది. ఖాతా బుక్‌లు నకిలీవని తెలియడంతో ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లారు. సబ్ డివిజన్ పోస్టల్ అధికారి ఏ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు బేగంపేట పోస్టల్ కార్యాలయానికి చేరుకొని రికార్డులు పరిశీలించారు. 200 మంది డబ్బులు డిపాజిట్ చేయగా, వారికి సదరు పోస్ట్ మాస్టర్ తన సంతకాలతో కూడిన నకిలీ పాసుపుస్తకాలు అందించి రూ.30 లక్షలు కాజేసినట్టు తేలింది. సెంటినరీకాలనీ మెయిన్ పోస్టాఫీస్‌లో గతంలో పని చేసిన నరేంద్రచారి అనే పోస్ట్ మాస్టర్ కారకుడనీ, నెల రోజుల సమయం ఇస్తే ఎవరి డబ్బు వారికి చెల్లిస్తానని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ పోస్ట్‌మాస్టర్ చెప్పడం గమనార్హం.
బేగంపేట పోస్టాపీస్‌లో పొదుపు పథకంలో జమ చేసిన ఖాతాదారులకు సంబంధించిన డిపాజట్లకు ఆన్లైన్ చేయడంతో డిపాజిట్ చేసిన వ్యక్తి ఫోన్‌కు సందేశం వస్తుందని విచారణ అధికా రి మోహన్ తెలిపారు. పొదుపు చేసుకునే వారికి పాసుపుస్తకం అందించి జమ చేసే డబ్బులను పొందుపర్చడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ పని చేస్తున్న ఓ పోస్ట్ మాస్టర్ నకిలీ పుస్తకాలు అందించి, ఒరిజినల్ ఖాతాదారుల ఖాతా నంబర్ వేసి పొదుపు సొమ్ము కాజేసినట్టు తేలిందని వివరించారు.