హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆయా షెడ్యూల్లోనే పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలను అక్టోబర్ 16 నుంచి 23 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): బ్లూంబర్గ్ బెస్ట్ బిజినెస్ స్కూల్-24 ర్యాంకింగ్స్లో వోక్సేన్ యూనివర్సిటీ సత్తాచాటింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో ఆరోస్థానాన్ని, మన దేశంలో మూడో ర్యాంకును సొంతం చేసుకుంది. ఐఐఎం బెంగళూరు, ఐఎస్బీ హైదరాబాద్ వరుసగా మన దేశంలో టాప్-2లో నిలిచాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): ఇన్స్పైర్ మానక్-2024 దరఖాస్తుల గడువును అక్టోబర్ 15 వరకు పొడగించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. 12,954 స్కూళ్ల నుంచి 64,770 దరఖాస్తులను లక్ష్యంగా పెట్టుకోగా 25,108 మాత్రమే వచ్చాయి. దరఖాస్తులు తక్కువగా రావడంతో గడువును అక్టోబర్ 15 వరకు పొడగించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తాజాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఫర్ యంగ్ లీడర్స్ (పీజీపీవైఎల్) పేరుతో సరికొత్త కోర్సును ప్రారంభించింది. 20 నెలల కాల వ్యవధి గల ఈ కోర్సును పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తారు. జీ మ్యాట్, జీఆర్ఈ, క్యాట్ స్కోర్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 2025 జూన్ తర్వాత ఈ కోర్సును నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు ఫీజు రూ. 21లక్షలుగా ఉంది. హాస్టల్ వసతికి రూ 3.95లక్షలు ఫీజుగా తీసుకుంటారు. 40 – 50 మందికి మెరిట్ స్కాలర్షిప్స్ను అందజేస్తారు.