Ranveer Singh Don 3 Controversy | ఫర్హాన్ అఖ్తర్ ప్రతిష్టాత్మక చిత్రం ‘డాన్ 3’ నుంచి నటుడు రణ్వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం బాలీవుడ్లో పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగిపోవడం వలన చిత్ర నిర్మాతలకు రూ.45 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సహాయ నిరాకరణ (Non-Cooperation) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంపై ‘సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (CINTAA) అధ్యక్షురాలు, సీనియర్ నటి పూనమ్ థిల్లాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నటీనటుల అధికారిక ప్రాతినిధ్య సంస్థ అయిన ‘సింటా’ను ఈ వివాదంలోకి ఎవరూ సంప్రదించకపోవడం విచారకరమని ఆమె అన్నారు.
రణ్వీర్ సింగ్ తమ అసోసియేషన్‌లో సభ్యుడైనప్పటికీ, ఈ సమస్యపై ఆయన కానీ, అటు నిర్మాతలు కానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ రణ్వీర్ ముందుగానే సింటాను సంప్రదించి ఉంటే, తాము జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి ఈ సమస్యను మరింత సామరస్యపూర్వకంగా పరిష్కరించేవాళ్లమని పూనమ్ థిల్లాన్ అభిప్రాయపడ్డారు. ప్రతి నటుడు తాము ఒప్పుకున్న సినిమాలకు కట్టుబడి ఉండాలని, ఏవైనా సమస్యలు వస్తే అసోసియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. అయితే, ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద లేనందున దీనిపై ఇప్పుడే తాము ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేమని ఆమె స్పష్టం చేశారు.