Bhupalpally | కృష్ణకాలనీ, జూన్ 12: బీఆర్ఎస్ ప్రభుత్వం గత అక్టోబర్‌లో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు భాస్కర్‌గడ్డలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఇండ్లు కేటాయించిందని, ఎన్నికల కోడ్ రావడంతో పట్టాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. మూడుసార్లు సర్వే చేసి, ప్రస్తుత జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమక్షంలోనే తమను గుర్తించి, లాటరీ ద్వారా తమకు ఇండ్లు కేటాయించి నంబర్లు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికలు అయిపోగానే పట్టాలిస్తామని కలెక్టర్ స్వయంగా చెప్పినప్పటికీ.. ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ప్రస్తుతం నివాసముంటున్న ఇండ్ల అద్దెలు కట్టలేకపోతున్నామని, దీంతో ఇంటి యాజమానులు తమను ఖాళీ చేయాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధికారులు రీ సర్వే చేశారని, తమపై కక్ష కట్టి కావాలనే తమకు కేటాయించిన ఇండ్లకు పట్టాలివ్వడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేస్తానని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇచ్చిన హామీ ఐదు నెలలైనా నెరవేరలేదని చెప్పారు. తమకు కేటాయించిన ఇండ్ల వద్ద వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడే ఉంటామని లబ్ధిదారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు బండి కుమార్, నూతి రమేశ్, పోశం కల్యాణి, మియాపురం స్వప్న, చారి, సతీశ్, తిరుపతమ్మ, పద్మ, లత, శ్రీనివాస్‌రెడ్డి, శారద, బొంతల రజిత, స్వరూపతోపాటు 100 మంది పాల్గొన్నారు.