జమ్మికుంట, నవంబర్ 10 : మధ్యాహ్న భోజనం వికటించి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. బాధిత విద్యార్థులకు వైద్యులు చికిత్స చేసి రాత్రి డిశ్చార్జి చేశారు. వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల ఉండగా ఇందులో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు చదివే విద్యార్థులు 102 మంది ఉన్నారు. సోమవారం పాఠశాలకు 71 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనంలో గుడ్డు కూడా వడ్డించారు. తినే సమయంలో గుడ్డు కుళ్లిన వాసన వస్తుందని విద్యార్థులు వంట మహిళలకు చెప్పారు. అప్పటికే విద్యార్థులంతా కాలం చెల్లిన గుడ్లను తినేశారు. గంట తర్వాత విద్యార్థులు కడుపునొప్పితో బాధపడటం మొదలైంది.
మరికొందరు వాంతులు చేసుకున్నారు. గమనించిన ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు విద్యార్థులను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్.. వంట మనుషుల పనితీరును ప్రశ్నించారు. అందుకు వంట మనుషులు ఉపాధ్యాయుడిపై తిరగబడినట్టు తెలిసింది.
దవాఖానలో చేరిన వారికి వైద్యులు చికిత్స అందించారు. దవాఖానలో చేరిన 26 మందిలో 9 మందిని సాయంత్రం డిశ్చార్జి చేయగా, మిగతా 17 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వారిని కూడా రాత్రి ఇంటికి పంపించారు. కాగా ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెంటనే కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం తీసుకున్న విద్యార్థుల పరిస్థితిని వివరించారు. అందుకు స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.