హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రూఫ్‌టాప్ ద్వారా సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మహేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సౌర, పవన, వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తిని పెంచడమేగాక వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కల్పించిన సోలార్ టెండర్లు, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సౌర రూఫ్‌టాప్ ట్రాకింగ్, నెట్ మీటరింగ్ వంటి సౌకర్యాలు దోహదపడ్డాయని తెలిపారు. గత నెలాఖరుకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 6,159 మెగావాట్లుగా నమోదైందని చెప్పారు. 5,748 మెగావాట్ల సౌర విద్యుత్తు, 128.10 మెగావాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేశామని వివరించారు. వచ్చే రెండేండ్లలో 2,500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో 136 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. బోథ్ మండల కేంద్రంలో నూతన అగ్ని మాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.