Peddavagu | భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట రూరల్/టౌన్/ఖమ్మం వ్యవసాయం: ఇటీవల అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బుధవారం రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న అనంతారం, కావడిగుండ్ల, తండాల్లో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. ఆ నీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు చేరింది. దీంతో గురువారం వాగుకు వరద ఉధృతి పెరిగింది.
దీనికితోడు పైనున్న కొండలు, గుట్టలపై నుంచి కూడా వరద ప్రాజెక్టులోకి చేరడంతో స్థాయికి మించి జలాలు రావడం వల్ల వాగు కట్టకు రెండుచోట్ల గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉండే గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు రెండుచోట్ల గండిపడిన దృష్ట్యా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు.
ప్రజలంతా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కంటిమీద కునుకు లే కుండా ఆందోళన చెందుతున్నారు. పోలీసు, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని అంచనా వేయడంతోపాటు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. అయితే ప్రాజెక్టు వరద నీరు దిగువకు వెళ్తుండటంతో ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుళ్లవాయి, మాధారం, రెడ్డిగూడెంతోపాటు మరో నాలుగు గ్రామాల ప్రజలను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరంతా ఆయా గ్రామాల మీదుగా రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తుంది.
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగులో భారీగా వరద నీరు చేరి బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు రెండుచోట్ల గండి పడటంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీట మునగనున్నాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు కలిపి 25 మంది పెదవాగు వరద నీటిలో చిక్కుకున్నారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న నారాయణపురం, బచ్చువారిగూడెం, ఏపీకి చెందిన మొత్తం 25 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇరు రాష్ర్టాల ఎమ్మెల్యేలు జారే అదినారాయణ, చిర్రి బాలరాజు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు నుంచి వేలేరుపాడుకు కారులో వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకున్నారు. వారు కారును వదిలేసి చెట్లను పట్టుకోవడంతోపాటు హాహాకారాలు చేశారు. అల్లూరిసీతారామనగర్ వద్ద గ్రామస్థులు వారిని రక్షించారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖమ్మం నగరంతోపాటు శివారులోని రూరల్, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, సత్తుపల్లి డివిజన్లోని సత్తుపల్లి, పెనుబల్లి, మధిర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అశ్వరావుపేట పెదవాగు ఘటనపై రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతం ఏపీకి దగ్గరగా ఉండటంతో ఆ రాష్ట్ర సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో మంత్రి మాట్లాడారని, ఆయన విజ్ఞప్తి మేరకు వాగులో చికుకున్న 30 మంది కూలీలను ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసి రక్షించిందని చెప్పారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఏపీ, తెలంగాణ అధికారులు సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ను ఆదేశించారు.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్దఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తగా దిగువ గ్రామాల రైతులు వరద నీటిలో చికుకున్న ఘటనపై ఆమె సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ పునరావాస చర్యలను సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని హెచ్చరించారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ వారికి స్పష్టంచేశారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని సూచించారు.