ముషీరాబాద్, జూన్ 30: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 25 వేల టీచర్ పోస్టులను ఒకే దఫాలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద ఆదివారం నిరుద్యోగులు చేపట్టిన ధర్నా లో ఆర్ కృష్ణయ్య ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఈడీ చేసిన వారే నాలుగు లక్షల మందికిపైగా ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,200 నోటిఫికేషన్లో పేర్కొన్నారని తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నీల వెంకటేశ్, పవన్, సంగేశ్, అనంతయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.