హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజీ మామూలుగా ఉండదు. నచ్చిన నంబర్ కోసం లక్షలు వెచ్చించేందుకు కూడా వాహన యజమానులు వెనకాడడంలేదు. అందు కు తాజా నిదర్శనం సోమవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబరు కోసం ఓ కంపెనీ రూ.25.50 లక్షలు వెచ్చించి ఆన్లైన్ వేలంలో సొంతం చేసుకుంది. ఈ ధర రవాణా శాఖ చరిత్రలోనే పెద్దదని జేటీసీ రమేశ్ తెలిపారు. సోనీ ట్రాన్స్ సొల్యూషన్స్ కొత్తగా కొనుగోలు చేసిన టొయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్స్ వాహనానికి టీజీ 09 9999ను అధిక మొత్తాన్ని బిడ్ వేసి సొంతం చేసుకుందని వెల్లడించారు. అదేవిధంగా టీజీ 09 ఏ 0006ను రూ.2.76 లక్షలు, టీజీ 09 ఏ 0005ను రూ.1,80,200కు, టీజీ 09 ఏ 0019ను రూ.1,20,019కు, టీజీ 09 9799ను రూ.1,16,111కు, టీజీ 09 ఏ 0009ను రూ.1,10,009కు వాహనదారులు ఆన్లైన్ వేలంలో సొంతం చేసుకున్నారని రవాణాశాఖ జేటీసీ తెలిపారు.