ABVP | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఏ కారణం లేకుండా ఏడు నెలలపాటు గవర్నర్ తొక్కిపెడితే నోరు మెదుపని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం.. ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు అంటూ చౌకబారు ఉద్యమాలు మొదలుపెట్టింది. పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. బిల్లులను తొక్కిపెట్టింది బీజేపీ నియమించిన గవర్నరే.. ఇప్పుడు ఆందోళన చేస్తున్నదీ ఆ పార్టీ విద్యార్థి సంఘం ఏబీవీపీయే కావటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం 13 సెప్టెంబర్ 2022న అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. దీనిని శాసనసభ, శాసనమండలి ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పం పింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని శ్రీనిధి, గురునానక్ విద్యాసంస్థలు కూడా యూనివర్సిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. చట్టసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోరుతూ సీఎంవో ద్వారా రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈ రెండు బిల్లులను ఆరు నెలలు తనవద్దే పెట్టుకొన్నారు. ఓపిక నశించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో పరువు పోవటం ఖాయమని భయపడి ఆయా బిల్లులను ఆమోదించకుండానే తిప్పి పంపారు.
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-2018’ చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారమే కొన్ని ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తూ బిల్లులు తెచ్చింది. ఈ బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నంతకాలం ఏబీవీపీ నోరు మెదుపలేదు. ఎప్పుడంటే అప్పుడు గవర్నర్‌ను కలుస్తున్న బీజేపీ నేతలూ బిల్లులను ఆమోదించాలని గవర్నర్‌ను కోరలేదు. ఇప్పుడు ఏ కారణం లేకుండానే బిల్లులను గవర్నర్ తిరస్కరించిన తర్వాత ఏబీవీపీ అసలు నాటకానికి తెరతీసింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ సహా ఇతర నేతలు వర్సిటీల ముందు ఆందోళనకు దిగి రభస చేయటం మొదలుపెట్టారు. దంతా చూస్తుంటే పక్కా కుట్రలో భాగంగానే ఆందోళన కొనసాగిస్తున్నట్టు అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణలో ప్రైవేటు వర్సిటీలకు అనుమతి ఇవ్వరాదని ఆందోళన చేస్తున్న ఏబీవీపీ.. తన మాతృ పార్టీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో యథేచ్ఛగా ప్రైవేటు వర్సిటీలకు అనుమతివ్వటాన్ని మాత్రం గొప్ప మార్పుగా ప్రచారం చేస్తున్నది. దేశంలో అత్యధిక ప్రైవేటు వర్సిటీలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఉన్నాయి. దేశంమొత్తంలో 397 ప్రైవేట్ యూనివర్సిటీలుంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే 220 ఉన్నాయి.
ఇవి కాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ర్టాల్లో మరో 25 ప్రైవేట్ యూనివర్సిటీలున్నాయి. మొత్తంగా 245 వర్సిటీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలిస్తున్న రాష్ర్టాల్లోనే ఉండటం గమనార్హం. 2014 తర్వాత దేశంలో 210 ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటయ్యాయి. గుజరాత్లో 50, హరియాణాలో 24, మధ్యప్రదేశ్‌లో 40, ఉత్తరప్రదేశ్‌లో 31, ఉత్తరాఖండ్‌లో 19, అరుణాచల్ ప్రదేశ్‌లో 8, అస్సాంలో 6, మణిపూర్‌లో 4, త్రిపురలో 1 చొప్పున ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటయ్యాయి.