Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): 76 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలు తప్పట్లేదు. వేసవిలోనే కాదు వానకాలంలోనూ పవర్ కట్లతో మెజార్టీ రాష్ర్టాల్లోని ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, బీహార్‌లో విద్యుత్తు కోతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ గడ్డ.. సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో కరెంటు కోతలు లేని రాష్ట్రంగానే కాదు.. మిగులు విద్యుత్తు, తలసరి కరెంటు వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా రికార్డులు సృష్టిస్తున్నది.
గ్రిడ్ ఇండియా తాజాగా వెల్లడించిన గణాంకాలే దేదీప్య తెలంగాణకు అద్దం పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌కు కీలకమైన ఆగస్టులో ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. భారత వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం… ఆగస్టు నెలకు సంబంధించి 1901 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. 1971-2000ను ప్రాతిపదికగా తీసుకుంటే దేశవ్యాప్తంగా ఆగస్టులో సగటున 254.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా.. 162.7 మి.మీ. (సాధారణం కంటే 36 శాతం తక్కువ) మాత్రమే నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో వేసవి మాదిరి ఎండ తీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
ఫలితంగా గృహ, పారిశ్రామిక, సాగురంగాల్లో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. సెప్టెంబర్ 1న ఒకానొక దశలో దేశవ్యాప్తంగా పీక్ డిమాండ్ 240 గిగావాట్లకు చేరుకొన్నది. దీంతో గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, బీహార్‌లో ఎడాపెడా విద్యుత్తు కోతలు విధించారు. గంటలకొద్దీ కోతలు విధిస్తుండటంతో చిన్న పరిశ్రమలకు పవర్ హాలిడేలను ప్రకటించే దుస్థితి నెలకొన్నది. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 74 శాతం ప్రాంతాల్లో కరెంటు కోతలు నమోదైనట్టు ‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడైంది.
తెలంగాణ మారిందిలా..
సమైక్యపాలనలో తెలంగాణ అంతటా విద్యుత్తు కోతలే రాజ్యమేలేవి. హైదరాబాద్‌లో రోజూ 2-4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలపాటు విద్యుత్తు కోతలుండేవి. వ్యవసాయానికి 3-4 గంటలపాటే కరెంటు సరఫరా జరిగేది. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్‌హాలిడేలు. పారిశ్రామికవేత్తలే ఆందోళనలు చేపట్టే పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం డిమాండ్‌లో 2,700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు సంక్షోభం నుంచి రాష్ర్టాన్ని శాశ్వతంగా బయటపడేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించింది. అవసరాలకు అనుగుణంగా తొలుత ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి కోతలు లేకుండా చేసింది. ఇదే సమయంలో సంస్థల అంతర్గత విద్యుత్తు సామర్థ్యం పెంపు, కొత్త విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. వెరసి రాష్ట్రం ఏర్పడిన ఆరునెలల వ్యవధిలోనే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేసి తెలంగాణ చరిత్ర సృష్టించింది. కొద్దికాలంలోనే వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును ఇచ్చి రికార్డు నెలకొల్పింది.
అక్కడ షాకర్.. ఇక్కడ బేఫికర్
బోరుబావులపై ఆధారపడిన తెలంగాణలో నెలరోజులుగా వర్షాలు లేకపోయినా వ్యవసాయ కరెంటుకు ఇసుమంతైనా అంతరాయం కలుగలేదు. నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా అందుతున్నది.
ఒక్క వ్యవసాయ విద్యుత్తు సరఫరాలోనే కాదు అటు గృహ, ఇటు పారిశ్రామికరంగాల్లోనూ విద్యుత్తు కోతలేవీ లేవు. కుంభవృష్టి కురిసినా కరెంటు పోలేదు. నిండు ఎండాకాలంలోనూ కోతల మాట వినపడలేదు. ఇది తెలంగాణ విద్యుత్తు విజయం. 9 ఏండ్ల కృషి, ప్రణాళిక సృష్టించిన ‘పవర్ఫుల్’ రాష్ట్రమిది.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోతలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. తీవ్రమైన విద్యుత్తు లోటుతో ఆ రాష్ర్టాలన్నీ తల్లడిల్లుతున్నాయని, తెలంగాణ మాత్రం ఏ లోటూ లేని రాష్ట్రంగా నిలిచిందని ‘గ్రిడ్ ఇండియా’ తాజా నివేదిక తేటతెల్లం చేసింది.
తలసరి విద్యుత్తులో తెలంగాణే టాప్
తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం : 2,166 యూనిట్లు
దేశంలో తలసరి విద్యుత్తు వినియోగం : 1,255 యూనిట్లు