హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మూలధన నిధులను సమకూర్చడం, ముడి పదార్థాల సరఫరా, ఉక్కు ఉత్పత్తుల కొనుగోలుకు భారీగానే ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 22 బిడ్లు దాఖలయినట్టు సమాచారం. బడా కంపెనీలు సైతం బిడ్లు దాఖలు చేసినట్టు తెలుస్తున్నది. ప్రజల తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓ కంపెనీ పేరుతో బిడ్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ బిడ్ల దాఖలు గడువు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియాల్సి ఉన్నది. కానీ, దీన్ని ఈ నెల 20 వరకు పొడిగించినట్టు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తాజాగా ప్రకటించింది.
ఉన్నతాధికారుల నివేదికపై సీఎంవో పరిశీలన
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.బిడ్ల దాఖలుకు తాజాగా గడువును 20 వరకు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నివేదికలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బిడ్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తున్నది.
నెలకు రూ.100 చొప్పున ఇస్తే..
స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే బిడ్ దాఖలు చేసినట్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 చొప్పున ఇస్తే 4 నెలల్లో రూ.3,200 కోట్లు వస్తాయని, ఆ సొమ్ముతో స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు.