నందికొండ/చింతలపాలెం/గద్వాల/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 6: నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు వరద పోటెత్తండంతో 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు సోమవారం రాత్రికి 585 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,08,770 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.
జూరాలకు 2,52,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 33 గేట్లు ఎత్తి 2,49,359 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,71,093 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10 క్రస్ట్ గేట్లను 12 అడుగులమేర ఎత్తి 3,72,053 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ నుంచి వరద పోటెత్తుతుండటంతో పులిచింతలలోని తెలంగాణ జెన్కో విద్యు త్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తిని మంగళవారం ప్రారంభించారు. జెన్కోలో 4 యూనిట్లలో విద్యు త్తు ఉత్పాదనకు అవకాశం ఉండగా ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల నీటితో మూడు యూనిట్లను నడిపిస్తూ 60 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు ఎస్ఈ దేశ్యానాయక్ తెలిపారు.