హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) పరిధిలోని స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే.. ఆ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేసి, సమస్యను పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఎస్సీబీ పరిధిలో కేవలం రెండు రోడ్లను మాత్రమే మూసివేసినట్టు లోక్‌సభలో శుక్రవారం రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ ప్రకటించడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్వీట్‌చేశారు. సహాయమంత్రికి క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలియవని, కంటోన్మెంట్లో ఏకంగా 21 రోడ్లను చట్టవిరుద్ధంగా మూసివేశారని పేర్కొన్నారు. రోడ్ల మూసివేత కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గ్రీన్ సైనిక్‌పురి తరఫున ట్రాఫిక్ సమస్యకు అద్దం పట్టేలా ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన పలువురు నెటిజన్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిస్సహాయ మంత్రిగారూ, చూస్తూ ఉండకుండా కొంచెం నోరు పెగిలించండి. మీ గుజరాత్ బాస్‌ల దగ్గర ఎంతసేపూ బానిసలాగా పడి ఉండటమేనా?’ అంటూ ఒక నెటిజన్ కిషన్‌రెడ్డిని ఎద్దేవాచేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా దద్దమ్మ అయ్యారు. ఇప్పుడు మీరు కేంద్రమంత్రి. మీ పరిధిలో ఉన్న సమస్యలను కూడా పట్టించుకోకపోతే ఎలా’ అంటూ మరో నెటిజన్ నిలదీశారు.