Telangana | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని యూనివర్సిటీలు బోధనా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత, నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన మన విశ్వవిద్యాలయాలు నేడు ప్రభను కోల్పోతున్నాయి. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 2,817 పోస్టులకు గానూ 2,060 (దాదాపు 75 శాతం) ఖాళీలు ఉన్నాయి. 757 మంది మాత్రమే ఉన్నారు. దీంతో రోజురోజుకు విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఉస్మానియాలో 73, కాకతీయలో 80, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 100 శాతం ఖాళీలు ఉండటం గమానార్హం. ఆరు యూనివర్సీటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సంక్షోభ తీవ్రతను తేటతెల్లం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు అటు పరిశోధన, ఇటు నాణ్యమైన విద్య అందిస్తూ రాణిస్తుండగా.. ఎంతో ఘన చరిత్ర కలిగిన మన విశ్వవిద్యాలయాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫ్యాకల్టీ కొరతతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పరిశోధనల్లో విద్యార్థులు వెనుకబడిపోతున్నాయి.
బోధనా సిబ్బంది లేక ఓయూ ప్రభ రోజురోజుకు మసకబారుతున్నది. ఓయూలో 1267 మంది బోధనా సిబ్బందికి గానూ 936 ఖాళీలు ఉన్నాయి. 331 మంది (27 శాతం) సిబ్బంది మాత్రమే ఉన్నారు. కాకతీయలో మొత్తం 55 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 409 మంది సిబ్బందికి గానూ 79 మంది మాత్రమే పనిచేస్తుండగా ఏకంగా 330 పోస్టులు (80 శాతం) ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 3 ప్రొఫెసర్లే ఉన్నారు. మొత్తం 152 మందికి గానూ 61 మంది మాత్రమే ఉండగా.. 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఒక్క ఫ్రొపెసర్ కూడా లేరు. మొత్తం 70 మందికి గానూ 35 మంది మాత్రమే ఉన్నారు. శాతవాహన వర్సిటీ 16 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లతోనే నెట్టుకొస్తున్నది. పాలమూరులో మొత్తం 95 మందికి గానూ 18 మందే బోధిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 55 పోస్టులు ఉండగా.. 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. బీఆర్ఏవోయూ 86 మందికి గానూ 24 మంది మాత్రమే ఉన్నారు. జేఎన్టీయూలో 410 మందికి గానూ 152 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. జేఎన్ఎఫ్ఏయూలో 55 మందికి గానూ 14 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆర్జీయూకేటీలో 19 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో 25 మంది మాత్రమే ఉన్నారు. కాగా 179 మంది టీచింగ్ ఫ్యాకల్టీని మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.
రాష్ట్రంలోని కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, పీఎస్టీయూ, ఆర్జీయూకేటీ యూనివర్సిటీల్లో అసలు ప్రొఫెసర్లే లేరు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే బోధనను నెట్టుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే యూనివర్సిటీలకు నిధులు పెంచుతామని, ఉన్నత విద్యను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఏడాది గడిచినా ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. యూనివర్సిటీల్లో నియామకాల కోసం ఉన్నత విద్యామండలి, వీసీల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు నిరుడు డిసెంబర్ 13న అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు ఎం కుమార్, అల్తాప్ హుస్సేన్ సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. నెల రోజులు దాటినా ఆ కమిటీ నివేదిక అందించలేదు. దీంతో ఇప్పటి వరకు పోస్టుల భర్తీపై ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు రాష్ట్రంలో చదివేందుకు ఆసక్తి చూపడం లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పాలకులు వెంటనే స్పందించి ఉన్నత విద్యారంగం అభ్యున్నతిపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. లేకపోతే సామాజిక, శాస్త్రీయ రంగాల్లో వెనుకబడిపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.