మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:00:23

పేరు మారింది.. అమ్మమ్మ నవ్వింది

పేరు మారింది.. అమ్మమ్మ నవ్వింది

భూపాలపల్లి:ఈ ఫొటోలో పట్టాదార్‌ ప్రతిని చూపిస్తున్న వృద్ధురాలి పేరు వెంకటమ్మ. పక్కన ఉన్నది ఆమె మనుమడు ప్రవీణ్‌. వీరిది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడు. వెంకటమ్మ భర్త ఊరుగొండ మల్లయ్య. ఆమె ఇద్దరు కూతుళ్లకు వివాహమైంది. మల్లయ్యకు వారసత్వంగా 2.14 ఎకరాల భూమి రాగా, 27 గుంటల భూమి వేరేవారి నుంచి కొన్నాడు. కొన్న భూమి పోనూ మిగతా భూమిని 30 ఏండ్లుగా సాగు చేస్తున్నాడు. కానీ, నాలుగు గుంటలే ఆయన పేరిటయింది. మనుమడు ప్రవీణ్‌తో కలిసి ఎన్నిసార్లు తాసిల్దార్‌ ఆఫీస్‌ చుట్టూ తిరిగినా పనికాలేదు. కొద్ది నెలల కిందట మల్లయ్య చనిపోయాడు. తర్వాత అమ్మమ్మ వెంకటమ్మ పేరిట భూమిని చేయాలని ప్రవీణ్‌ ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో తన భర్త పేరిట ఉన్న 4 గుంటల భూమిని తన పేరు మీద చేసుకోవడానికి వెంకటమ్మ స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నది. మనుమడు ప్రవీణ్‌తో కలిసి తాసిల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లింది. అరగంటలోనే ధరణి పట్టాదార్‌ ప్రతిని జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఎం అశోక్‌కుమార్‌.. వెంకటమ్మకు అందజేశారు. మిగతా భూమిని కూడా తన అమ్మమ్మ పేరిట చేయాలని ప్రవీణ్‌ అధికారులను కోరగా.. పరిశీలించి పట్టాకు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ‘ఇంత తొందర పనైతదని అనుకోలె. ఆయింత భూమి కూడా నా పేరు మీదికి అయితదనే నమ్మకం ఉన్నది’ అంటూ వెంకటమ్మ మనుమడితో కలిసి తాసిల్‌ ఆఫీస్‌ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్లింది.

గతంల పనికాక ఇంటికి పోయినం 

గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పోయి రోజంతా ఎదురుచూసి పనికాక ఇంటికి పో యిన రోజులున్నయి. మ్యుటేషన్‌ కోసం 45 రోజులు సమయమిస్తే పడనోళ్లు పేచీలు పెట్టినారని అధికారులు ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ముహూర్తం చూసుకొని ఈ రోజు బాగుందని రిజిస్ట్రేషన్‌ పెట్టుకున్నా. తొందరగానే అయితదని అందరు చెప్తే నమ్మబుద్దికాలే. 20 నిమిషాల్లోనే పని అయిపోయింది. ఇంత సులువుగా అయితదనుకోలే.

-దొంగరి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, లక్కవరం, హుజూర్‌నగర్‌ మండలం, సూర్యాపేట జిల్లా 

నమ్మలేకపోయా 

గతంలో రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్లాలంటే ఆ రోజంతా వేరే పని పెట్టుకోకపోయేటోళ్లం. గంటల కొద్దీ రిజిస్ట్రేషన్‌ ఆఫీసు చుట్టే తిరిగేటోళ్లం. చేయి తడిపితేగానీ పని పూర్తయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు తాసిల్దార్‌ ఆఫీస్‌లో కొన్ని నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతున్నది. నేను ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇంత తొందరగా రిజిస్ట్రేషన్‌ అవుతున్నదా అని ఆశ్చర్యపోయిన. అసలు నమ్మలేదు.

-నారాయణవరపు కిశోర్‌, బీరాపల్లి, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా

 సమయం, ఖర్చు, భారం తగ్గింది 

రిజిస్ట్రేషన్‌ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగడానికే రెండు నెలలు పట్టేది. చాలా ఇబ్బందులు ఉండేవి. కేటీదొడ్డి మండలంలోని చింతలకుంటల ఎకరా పొలం కొన్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం తాసిల్‌కు పోతే అరగంటల పనయిపోయింది. అధికారులు అప్పుడే పత్రాలు చేతిలో పెట్టారు. సమయం, ఖర్చు, భారం తగ్గింది. 

- జీ శ్రీనివాసులు, రైతు, చిన్నోనిపల్లి, గట్టు, జోగుళాంబ గద్వాల జిల్లా

ఆఫీస్‌ల గింత మర్యాద ఎప్పుడూ చూడలే

మాది కోటకదిర గ్రామం. సర్కారు ఆఫీస్‌లో పని ఉందయ్యా.. అంటే ఏం పని చేస్తాం పో.. అనే రోజులు చాలా చూశా. ఆఫీస్‌ల జర్రంత పని చేసుకుందాం అంటే ఎవరో ఒక్కరు తెలిసినవారుంటే తప్ప కాదు. గిప్పుడు భూమిని నా కొడుకులిద్దరికి పట్టా చేసిద్దామని మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండల ఆఫీస్‌కు పొయిన. పోయిన వెంబడే కుర్చివేసి చాంబర్‌లనే కూర్చోబెట్టిండ్రు. నా పేరు మీద రెండు గుంటలు ఉంచుకుని నా కొడుకులు భాస్కర్‌రెడ్డి పేరుమీద 26 గుంటలు, కరుణాకర్‌రెడ్డి పేరుమీద 26 గుంటల భూమి పట్టా చేపించిన. లొల్లి లేకుట్ట ప్రశాంతంగా అయిపోయింది. గింత మర్యాద ఇచ్చి సర్కారు ఆఫీస్‌లో పనిచేస్తరనుకోలేదు. 

-  గోవర్ధన్‌రెడ్డి, రైతు, కోటకదిర, మహబూబ్‌నగర్‌

పోర్టల్‌తో ప్రజలకు మేలు

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో ప్రజలకు గొప్ప మేలు కలుగుతుంది. భూ లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తవడం, వెంటనే పాస్‌పుస్తకాలు, హక్కుపత్రాలు పొందడం విప్లవాత్మకం. ఆధార్‌ లేని ఎన్నారైల ఆస్తులకు పాస్‌పోర్ట్‌ను అనుసంధానిస్తామని ప్రకటించడం హర్షణీయం. ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డులను కూడా పరిగణనలోకి తీసుకొంటే బాగుంటుంది.

-బైరు శ్రవణ్‌కుమార్‌గౌడ్‌, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) బ్రిటన్‌ అధ్యక్షుడు 

ఏండ్ల కల సాకారమైంది

రాష్ట్రంలోని భూముల వివరాలను ప్రపంచంలో ఏ మూలన ఉన్న తెలంగాణ బిడ్డ అయినా తెలుసుకొనే సౌకర్యం కల్పించడం హర్షణీయం. ఇలాంటి సేవల కోసం మాలాంటి ఎన్నారైలు ఎన్నో ఏండ్లుగా కంటున్న కల సాకారమైంది. అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ జరిగేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక వ్యవస్థను రూపొందించడం అత్యంత అభినందనీయం.

-కూర్మ మారుతి, మలేషియా