హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురవుతున్నది. అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లను మంజూరు చేయడంతో.. అవి కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై యాప్‌లో తిరస్కారానికి గురవుతున్నాయి. మంజూరు చేసిన ఇండ్లలో ఇప్పటివరకు దాదాపు 20 వేల ఇండ్లు రద్దు కావడమే ఇందుకు నిదర్శనం. అందులో పెద్ద సంఖ్యలో ఇండ్లు నిర్మాణం మొదలయ్యాక రద్దు కావడం గమనార్హం. దీంతో ఇల్లు మంజూరైనవారు తమ ఇల్లు ఎప్పుడు రద్దవుతుందోననే ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) భాగస్వామ్యంతో అమలుచేస్తున్న విషయం విదితమే.
అయితే, పీఎంఏవై పథకం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నందున లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 360 డిగ్రీల చెకింగ్‌తో కూడిన యాప్‌ను రూపొందించారు. అందులో ఆధార్ నంబర్‌ను నమోదుచేస్తే లబ్ధిదారుల వివరాలన్నీ తెలిసిపోతాయి. పీఎంఏవై నిబంధనల్లో ముఖ్యంగా నిరుపేదలు, వితంతువులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కుటుంబంలో ఏ ఒక్కరూ గత 20 ఏండ్లలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందనివారై ఉండాలనే నిబంధన విధించారు. కుటుంబ ఆదాయం, ఆస్తుల వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఈ యాప్‌కు ఉన్నది. ఫైనాన్స్ ద్వారా వాహనాలు, విలాస వస్తువులు ఏమైనా కొనుగోలు చేసినా అందులో తెలిసిపోతుంది. ఉదాహరణకు ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు వంటి విలాస వస్తువులు ఉన్నవారు ఒకవేళ అద్దె ఇంటిలో ఉంటున్నా, వీరి దరఖాస్తు తిరస్కారానికి గురవుతున్నది. కుటుంబ జీవన ప్రమాణాలను అంచనావేసి వారికి ఇల్లు మంజూరు చేయాలో, వద్దో యాప్ ద్వారా నిర్ణయమవుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా అంతా సాఫ్ట్వేర్ ద్వారానే జరిగిపోతుంది.
రాష్ట్ర సర్కారు అనర్హులను ఎంపిక చేయడంతోనే ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, అందులో దాదాపు లక్షన్నర మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టారు. వీరిలో కొందరికి రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నుంచి మొదటి విడత నిధులను విడుదలచేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం లబ్ధిదారుల వివరాలను పీఎంఏవై యాప్‌లో నమోదు చేస్తుండగా, పెద్ద సంఖ్యలో దరఖాస్తులకు రెడ్‌మార్క్ చూపిస్తున్నది. అంటే, వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు పొందే అర్హత లేదన్నమాట. పేదల ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నది.
రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వా టాను జోడించి ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నుంచి ఇప్పటివరకు లబ్ధిదారులకు సుమారు రూ.120 కోట్లు విడుదల చేసింది. పీఎంఏవైలో ఇల్లు మంజూరైతేనే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన మూడు లక్ష ల ఇండ్లలో 1.5 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. కాగా, అందులో దాదాపు 20 వేల ఇండ్లకు కేంద్రం నుంచి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇండ్లను రద్దుచేసింది. ఇందులో దాదాపు సగంమంది ఇండ్ల నిర్మాణం ఇప్పటికే చేపట్టగా, చావుకబురు చల్లగా చెప్పినట్టు ఇండ్లను రద్దుచేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అత్యుత్సాహంతో ఎడాపెడా అనర్హులకు, నేతల అనుచరులకు మంజూరు పత్రాలు ఇవ్వడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు.
మంజూరు పత్రాలు పొందినవారిలో ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌కు రూ.5 లక్షల చొప్పున రూ.22,500 కోట్లు అవసరమవుతాయి. కేంద్రం నుంచి కొన్ని నిధులు వస్తే, మిగిలింది రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే, కేంద్ర సర్కారు రాష్ర్టాలు పంపే లబ్ధిదారుల జాబితా ఆధారంగా గంపగుత్తగా నిధులిస్తే.. సమస్య ఏర్పడేది కాదు. కానీ, కేంద్రం అలా చేయడంలేదు. పీఎంఏవై కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టమొచ్చినవారికి ఇండ్లు మంజూరు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు, ఇండ్లు రద్దవుతున్నాయన్న వార్తతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. ‘మా ఇల్లు కూడా రద్దవుతుందా? ఒకవేళ అలా అయితే ముందే చెప్పండి. మేము నిర్మాణాలు చేయకుండా ఊరుకుంటాం’ అని వారు అధికారులను వేడుకుంటున్నారు. తీరా నిర్మాణం మొదలుపెట్టాక రద్దుచేస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.