వరంగల్ లీగల్, ఆగస్టు 28: రెండోతరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమానా విధిస్తూ వరంగల్లోని ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పు ప్రకటించింది. పోక్సో చట్టం కింద ఈ కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వమే రూ.10 లక్షలను పరిహారంగా అందజేయాలని తీర్పు ప్రకటించి దేశంలో అత్యధిక పరిహారాన్ని ప్రకటించిన న్యాయమూర్తిగా మనీషా శ్రావణ్ నిలిచినట్టు పీపీ మోకీల సత్యనారాయణ తెలిపారు. రామన్నపేట పరిసరాల్లో 2019 ఫిబ్రవరి 5న చర్చికి వెళ్లిన ఏడేండ్ల చిన్నారిపై ఓ వ్యక్తి చాక్లెట్ కొనిస్తానని లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువైందని భావించిన న్యాయస్థానం నిందితుడు ప్రభుచరణ్కు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
కరెంట్ షాక్తో చిరుత మృత్యువాత ;కామారెడ్డి జిల్లాలో ఘటన
ఎల్లారెడ్డి, ఆగస్టు 28: అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు కంచెకు తగిలి ఓ చిరుత కరెంట్షాక్తో మృత్యువాత పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండ లం హాజీపూర్ పంచాయతీ పరిధిలోని కట్టకింది తండాలో మంగళవారం చోటు చేసుకొన్నది. అయితే సదరు రైతు దూప్య విషయం బయటకు రాకుండా తన పొలంలోనే చిరుత కళేబరాన్ని పాతిపెట్టాడు. విషయం తెలుసుకున్న అటవీ, పోలీస్ అధికారులు బుధవారం అక్కడికి వెళ్లి చిరుత కళేబరాన్ని వెలికితీశారు. సుమారు రెండేండ్ల వయస్సు ఉన్న ఆడ చిరుతగా గుర్తించారు. అక్కడే పశువైద్యాధికారి రవికుమార్ పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం అటవీ ప్రాంతంలో దహనం చేశారు. కేసు నమోదు చేసి రైతు దూప్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఫారెస్టు అధికారి ఓంకార్ తెలిపారు.