హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అక్షరాలా అయిదు వందల రూపాయలు లంచం తీసుకున్నాడన్న ఆరోపణపై నమోదైన కేసు విచారణ 20 ఏండ్లపాటు కొనసాగింది. అదనపు కమిషనర్ ఆఫీసులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌పై ఏసీబీ 2005లో నమోదు చేసిన అభియోగాలను కింది కోర్టు కొట్టివేసింది. దీంతో ఏసీబీ హైకోర్టును ఆశ్రయించగా.. 12 ఏండ్ల తరువాత ఆ అప్పీల్ కూడా వీగిపోయింది. మ్యుటేషన్ చేసేందుకు రూ.500 లంచం తీసుకున్నారనే కేసు నుంచి బయటపడేందుకు జూనియర్ అసిస్టెంట్ 20 ఏండ్లపాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. బేగంపేటకు చెందిన బీ శ్రీనివాస్ ఇల్లు కొనుగోలు చేసినప్పుడు మ్యుటేషన్ చేయించేందుకు సికింద్రాబాద్ డివిజన్ అదనపు కమిషనర్ ఆఫీసుకు వెళ్లాడు. అకడ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే అర్షిత్కుమార్ అతని వద్ద రూ.500 లంచం తీసుకుంటూ 2005 ఏప్రిల్ 21న ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దీనిపై ఏసీబీ నమోదు చేసిన కేసును 2013లో కింది కోర్టు కొట్టేసింది. దీనిపై ఏసీబీ హైకోర్టులో అప్పీల్ చేయగా జస్టిస్ ఈవీ వేణుగోపాల్ దానిని కొట్టివేస్తూ ఇటీవల తీర్పు చెప్పారు.. మ్యుటేషన్ ఫైల్ పెండింగ్‌లో లేనప్పుడు లంచం అడగడం, తీసుకోవడం జరగదన్న అర్షిత్కుమార్ వాదనతో ఏకీభవించిన కింది కోర్టు కేసు కొట్టేసిందని న్యాయమూర్తి అన్నారు. కక్షసాధింపు, దురుద్దేశంతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు ఫిర్యాదుదారే అంగీకరించారని గుర్తుచేశారు.