హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): పేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు 20 వేల కుట్టుమిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. ఇందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదించగా, ఆమోదం తెలిపింది. మైనార్టీ వర్గాల్లోని మహిళలు బయటకు వచ్చి పని చేయలేని పరిస్థితుల్లో వారికి ఇంటివద్దనే ఉపాధి కల్పించేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రణాళికలను రూపొందించింది. అందులోభాగంగా పేద మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ ఇప్పించడంతోపాటు కుట్టుమిషన్లను ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను పంపగా, ప్రభుత్వం ఇటీవలనే ఆమోదించింది. ఇదిలా ఉండగా కుట్టుమిషన్ శిక్షణ, పంపిణీకి లబ్ధిదారుల ఎంపికతోపాటు తదితర అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రూపొందిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో మైనార్టీ కమ్యూనిటీ గార్మెంట్స్ ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధిత సంస్థలు, కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న సంస్థలు 27వ తేదీలోగా టెండర్లను దాఖలు చేయాలని ఆ ప్రకటనలో తెలియజేశారు.