మానవపాడు, ఆగస్టు 7 : లంచం ఇచ్చినా పని చేయలేదని విసిగి వేసారిన ఓ రైతు అధికారికి డబ్బులిచ్చే వీడియోలు బయటపెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన శివశంకర్‌కు పూసల్పాడు శివారులో ఎకరా 10 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి బదలాయింపు కోసం తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. రిజిస్ట్రేషన్‌కు రూ.20 వేలు ఇవ్వాలని తాసీల్దార్ డిమాండ్ చేశాడు.
చివరికి ఇద్దరి మధ్య రూ.6 వేలకు ఒప్పందం కుదిరింది. మరుసటి రోజు కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.6 వేలు ఇచ్చిన రైతు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బదలాయింపు తర్వాత ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్) కాపీ అడిగితే మిగితా మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. పూర్తి ఘటనను రైతు వీడియో తీశా డు. తాసీల్దార్ జ్యోషి శ్రీనివాసశర్మను వివరణ కోరగా.. 1973-74 రికార్డు ప్రకారం పట్టాకాలంలో రైతు ఉన్నందున ఆ రికార్డులను పరిగణలోకి తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశానుసారం రిజిస్ట్రేషన్ చేశామని వెల్లడించారు. ఇందుకోసం డబ్బులు డిమాండ్ చేయలేదని, కంప్యూటర్ ఆపరేటర్ తీసుకొని ఉంటే మెమో జారీ చేస్తామని తెలిపారు.