హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీ కీలక నేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కి టాప్ కమాండర్‌గా ఎన్నికైన బడ్సే సుక్కా అలియాస్ దేవా సహా 20 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారి లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజిరెడ్డి దంపతులు కూడా ఉన్నారని చెప్పారు. పీఎల్బీఏ బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ ప్ర ధాన సైనిక విభాగం ఉనికి అంతిమదశకు చేరిందని, రాష్ట్రంలో అధికసంఖ్యలో లొంగుబాట్లు సాగుతున్నాయని, మిగిలిన వారూ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన తేదీ సమీపిస్తున్నదని, మిగిలిన వారు కూడా త్వరగా లొంగిపోతే పోలీసుశాఖ తరఫున పూర్తి సహకారం ఉంటుందని డీజీపీ పునరుద్ఘాటించారు. త్వరలోనే తెలంగాణ మావోయిస్టులరహిత రాష్ట్రంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
20 మందిపై రూ.1.81 కోట్ల రివార్డు
శనివారం లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1,81,90,000 రివార్డు ఉన్నట్టు డీజీపీ చెప్పారు. బడ్సే దేవా ఒక్కడిపైనే సుమారు రూ.75 లక్షల రివార్డు ఉన్నట్టు గుర్తు చేశారు. మిగిలిన అందరికీ తక్షణం రూ.25 వేల ఆర్థికసాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టుల నుంచి రూ.20.30 లక్షల నగదు, 48 అత్యాధునిక ఆయుధాలు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, గ్రేహౌండ్స్ డీజీ అనిల్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్ సుమతి తదితరులు ఉన్నారు.
ఆ గన్ ఎక్కడిది?
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాల్లో అత్యాధునికమైనవి పోలీసులకు మరింత పని పెట్టాయి. ఇజ్రాయెల్‌లో తయారైన అడ్వాన్స్ థావర్ రైఫిల్ (సుమారు కిలోమీటరున్నర లక్ష్యాన్ని ఛేదించేవి), హెలికాప్టర్‌ను సైతం పేల్చే బుల్లెట్లు చూసి అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకునే దిశగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. సీఆర్పీఎఫ్లోని కోబ్రా దళాలు, బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ వంటి కేంద్ర బలగాలు వద్ద ఉండే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ (ఐఎంఐ) అభివృద్ధి చేసిన ఈ ఆయుధాలు దేవా దగ్గరకు ఎలా వచ్చాయనే విషయమై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
అనారోగ్య కారణాలతోనే లొంగిపోయా: మావోయిస్టు నేత రాజిరెడ్డి
మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రాంకోతో కలిసి లొంగిపోవడంతో స్వగ్రామం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట ఊపిరి పీల్చుకున్నది. కాల్వశ్రీరాంపూర్‌లో పదో తరగతి వరకు చదివిన రాజిరెడ్డి 1992 – 1994 వరకు పీపుల్స్‌వార్‌లో మిలిటెంట్‌గా చేసి 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దపల్లి దళ కమాండర్‌గా, కేకేడబ్ల్యూ (ఖమ్మం, కరీంనగర్, వరంగల్) కార్యదర్శిగా, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. 25 ఏండ్ల అజ్ఞాతవాసంలో కిష్టంపేట, సుంకరికోట, మానాల, ఛత్తీస్‌గఢ్ కుంట ఎన్కౌంటర్లలో ఆయన చనిపోయారని వార్తలు వచ్చినా తప్పించుకున్న చరిత్ర ఉన్నది. కాగా, తాను అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్టు డీజీపీ ఎదుట సరెండర్ అయిన తర్వాత రాజిరెడ్డి పేర్కొన్నారు.
మిగిలింది 17 మంది మాత్రమే
2024 నుంచి నేటి వరకు తెలంగాణలో 576 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టులు లొంగిపోయారని, వారి లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, 14 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి కేవలం 17 మంది మావోయిస్టులు మాత్రమే అడవుల్లో ఉన్నారని, వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం అడవుల్లో ఉన్న తెలంగాణ బిడ్డల్లో ముప్పాల లక్ష్మణరావు @ గణపతి, తిప్పరి తిరుపతి @ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్, పుసునూరి నరహరి @ సంతోష్, ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్, వార్త శేఖర్ @ మంగ్తూ, జోడే రత్నబాయి @ సుజాత, లోకేటి చందర్ రావు @ ప్రభాకర్, బడే చొకారావు @ దామోదర్, నక సుశీల @ రేల, జాడి పుష్ప @ రాజేశ్వరి, రంగబోయిన భాగ్య @ రూపి, కాశపొగు భవాని @ సుగుణ, బదీషా ఉంగా @ మంతు, మడివి అడుమే @ సంగీత, కుంజం ఇడమాల్, ఉతిమి అనిల్‌కుమార్ ఉన్నారని డీజీపీ వివరించారు.