Overseas scholarship | విదేశీ విద్య ఒకప్పుడు అందనిద్రాక్షే. పేద కుటుంబాల పిల్లలకు అది కలలోనైనా ఊహకందనిది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో నచ్చిన కోర్సును పూర్తిచేసే ధైర్యాన్నిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పైసా ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు ‘ఓవర్సీస్ స్కాలర్షిప్’ పథకం మార్గం సుగమం చేసింది.
ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక ప్రోద్బలంతో వేలాదిమంది యువతీయువకులు కలల్ని సాకారం చేసుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు బ్రాహ్మణ పరిషత్ ద్వారా అర్హులైన ఒక్కొక్కరికి రూ.20లక్షల మేర సాయం అందుతున్నది. ఇంతవరకు మొత్తం 6,701 మంది విదేశీవిద్యను అందుకున్నారు. వారికోసం రాష్ట్రంలో ప్రభుత్వం వెచ్చించింది అక్షరాలా రూ.948 కోట్లు!
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో చదువుకోవడమనేది ప్రతీ విద్యార్థి కల. ఆర్థికంగా ఉన్నవారు ప్రయాస లేకుండా వెళ్తుండగా, పేద విద్యార్థులు మాత్రం ఆ కలను సాకారం చేసుకొనేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్య కలలను సాకారం చేస్తున్నది. బీసీల కోసం జ్యోతిబాఫూలే, ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్, మైనార్టీలకు సీఎం ఓవర్సీస్, బ్రాహ్మణ విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తున్నది. అన్ని క్యాటగిరీల్లో కలుపుకొని ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 6,701 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేసుకోగా, ప్రభుత్వం రూ.947.8 కోట్లు వెచ్చించింది. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, మిచిగాన్ టెక్నాలజీ యూనివర్సిటీ, మిన్నిసోటా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారు. అక్కడ ఉన్నతవిద్యను పూర్తి చేసుకోవడంతోపాటు అత్యున్నతస్థాయిల్లో ఉద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడుతున్నారు.
ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు
విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సుల అభ్యాసానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ప్రతి సంవత్సరం జనవరిలో (స్ప్రింగ్ సీజన్) 150 మంది, ఆగస్టులో (ఫాల్ సీజన్) 150 మందిని మొత్తంగా రెండు సెషన్లకు కలిపి ఒక్కో క్యాటగిరీకి 300 మంది నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. వీసా చార్జీలు, ఇతర ఖర్చుల కోసం రూ.50 వేలు ఇస్తున్నారు. జ్యోతిబా ఫూలే విద్యానిధి పథకంలో మొత్తం సీట్లలో 30 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు (ఈబీసీ)లకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు.
ఇవీ అర్హతలు
ఎంపిక ఇలా
సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం..
తెలంగాణ ప్రభుత్వం మా బిడ్డకు కొండంత అండగా నిలిచింది. పైసా ఖర్చు లేకుండా రూ.20 లక్షలు సదువు కోసం ఇవ్వడంతో బిడ్డ ఉన్నతస్థాయికి ఎదిగింది. ఆనాడు కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా చేసిన ఆర్థిక సహాయం మమ్మల్ని ఆదుకున్నది. సర్కార్ సహాయం చేయకపోతే మా రెండోబిడ్డ జయశ్రీ చిన్న చదువులకే పరిమితమయ్యేది. ఇప్పుడు పెద్ద చదువు చదువుకోవడం వల్లనే పెద్ద కుటుంబం నుంచి సంబంధం వచ్చింది. కల్యాణలక్ష్మి సహాయం కూడా అందటంతో పెండ్లి ఖర్చులు కలిసివచ్చినయ్. ఇప్పుడు బిడ్డ, అల్లుడు అమెరికాలో ఉంటూ కొలువులు చేయడం ఎంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు మేము జీవితాంతం రుణపడి ఉంటాము.
– కీర్తి సత్యం, సరిత / వరంగల్
కలలో కూడా ఊహించలేదు
నేను మేస్త్రి పనిచేస్తా. పనిచేస్తేనే పూట గడుస్తుంది. నాకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు దినేశ్‌కుమార్ తిరుచిరాపల్లి నిట్‌లో బీటెక్ పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఓవర్సీస్ పథకం ద్వారా అమెరికాలోని ఓక్లహామా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్(ఎంఎస్) చేస్తున్నాడు. కూలి నాలి చేసుకొని బతికే మాలాంటి వాళ్లకు విదేశాల్లో చదివించడం ఈజీ కాదు. యూనివర్సిటీలో చేరేందుకు రూ.20 లక్షలు, విమానం కిరాయి రూ.50 వేలు, వీసా ఖర్చులు ఇచ్చారు. మాలాంటి నిరుపేదలకు ఇంతకన్నా ఇంకేం కావాలి. నిరుపేదలకు వరాలు ఇచ్చే దేవుడిలాంటోడు సీఎం కేసీఆర్. సార్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
-దుర్గం రమేశ్, మేస్త్రి, వికాస్‌నగర్, హనుమకొండ
కలలో కూడా ఊహించలేదు
మాది వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ తండా గ్రామం. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. హైదరాబాద్ బోడుప్పల్‌లోని విసన్ కళాశాలలో బీఫార్మసీ చదివాను. మాస్టర్ బయోటెక్నాలజీ చదవాలన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నా. రెండు విడతలుగా 10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ఆర్థికసాయం అందడంతో 2017లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మాస్టర్ బయోటెక్నాలజీ పూర్తి చేసిన. మాలాంటి వాళ్లం విదేశీ విద్యను కలలో కూడా ఊహించలేం. కేవలం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం నా కలను సాకారం చేసింది. ప్రస్తుతం మేడ్చల్‌లో ఫార్మాసిటీ ల్యాబ్‌లో జూనియర్ అనలిస్ట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నా. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ చొరవతోనే సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-కేతావత్ రాజేందర్, రంగాపూర్ తండా, వికారాబాద్ జిల్లా
మా పూర్వజన్మ సుకృతం..
నా బిడ్డ బానోతు సోనియా చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. మాది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తూర్పు తండా గ్రామం. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అమ్మాయి పెద్ద చదువు సదువుతానంటే 2021లో అప్పులు చేసి న్యూయార్క్‌కు ఎంఎస్ కోసం పంపించినం. తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ పథకం ద్వారా రూ.20 లక్షల స్కాలర్షిప్ ఇస్తుందని తెలిసి దరఖాస్తు చేసింది. న్యూయార్క్ నుంచే ఆన్లైన్లో ఇంటర్వ్యూ పూర్తి చేసింది. 2022లో రూ. 20 లక్షల స్కాలర్షిప్ మంజూరు పత్రం ఇచ్చిండ్రు. కొద్దిరోజులకు రూ. 10 లక్షలు బ్యాంకు ఖాతాల జమైనయి. మరో 10 లక్షల రూపాయలు ఇస్తారని అధికారులు సమాచారం ఇచ్చారు. ఆర్థిక సాయం అందించిన సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. కేసీఆర్ దయవల్ల స్కాలర్షిప్ రావడం ఎంతో ఆర్థిక వెలుసుబాటు కలిగింది. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నా బిడ్డ పైచదువుల కోసం స్కాలర్షిప్ అందించడం మా పూర్వ జన్మసుకృతం.
– బానోతు రవినాయక్, తూర్పుతండా, పర్వతగిరి మండలం, వరంగల్ జిల్లా
పోతానంటే పైసలు లేవని చెప్పిన
నేను కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్త. ఆదాయం అంతంత మాత్రమే. నా కొడుకు భరత్ కష్టపడి చదివిండు. విదేశాల్లో పైచదువుల కోసం వెళ్తానంటే డబ్బులు లేవని చెప్పిన. పైసల కోసం మస్తు తిరిగినం. సీఎం కేసీఆర్ స్కీం పెట్టిండని నా కొడుకు చెప్పిండు. దరఖాస్తు చేసినం. వస్తుందో రాదోనని చాలా టెన్షన్ పడ్డం. కానీ, సీఎం దయవల్ల మా కొడుకు విదేశాల్లో చదువుకొనేందుకు స్కాలర్షిప్ మంజూరైంది. ప్రస్తుతం లండన్‌లోని యూనివర్సిటీలో చదువుతుండు. నిజంగా కేసీఆర్ వల్లే నా కొడుకు విదేశంలో చదువుతుండు. పేదబిడ్డలకు అండగా నిలుస్తున్న కేసీఆర్ గురించి ఎంత జెప్పినా తక్కువే.
-సుంచు శ్రీనివాస్, కేబుల్ ఆపరేటర్, కార్ఖానగడ్డ, కరీంనగర్ జిల్లా
కేసీఆరే మాకు దేవుడు
నేను కిరాయి కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్న. నా కొడుకు షారూఖ్ అహ్మద్‌ను కూడా డ్రైవర్‌గా చేద్దామనుకొన్న. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ బడుల్లోనే చదివించిన. మంచి మార్కులు తెచ్చుకొన్నడు. ఇంజినీరింగ్‌లో మంచి మార్కులతో పాసైండు. నా కొడుకుతో చదువుకున్నోల్లు అమెరికాలో చదువుకొనేందుకు వెళ్తున్నారని తెలిసి, నేను కూడా పోత అని అడిగిండు. ఆర్థిక పరిస్థితి బాగా లేక వద్దని చెప్పిన. పేద బిడ్డల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న విదేశీ విద్య స్కీం గురించి నా కొడుకు చెప్పిండు. వెంటనే వెళ్లి దరఖాస్తు చేసినం. కేసీఆర్ దయ వల్ల మాకు మొదటి విడతనే రూ.10 లక్షలు వచ్చినయ్. ఆ పైసలతో టెక్సాస్‌లోని బోల్వార్డ్ ట్రైలర్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ కోర్సు చేస్తున్నడు. వచ్చే ఏడాది చదువు పూర్తి అవుతుందని చెప్పిండు. కేసీఆరే లేకుంటే నా కొడుకు విదేశానికి వెళ్లే వాడేకాడు. ఆయనే మా కుటుంబానికి దేవుడు.
-మహ్మద్ ఖమ్రుద్దీన్, కారు డ్రైవర్, కశ్మీర్‌గడ్డ, కరీంనగర్
తండ్రి లేని లోటు తీర్చిండు
మాకు 2 ఎకరాలు భూమి ఉన్నది. ఇదే జీవనాధారం. వ్యవసాయంపై వచ్చే ఆదాయం మా చదువులకు, కుటుంబ పోషణకు సరిపోకపోయేది. చేసేది లేక నేను, నా తమ్ముడు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఇంజినీరింగ్ పూర్తి చేసినం. ఇంతలోనే నాన్న చనిపోయాడు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. పైచదువులు చదవాలని ఉండేది. అప్పుడే విదేశాల్లో చదువుకొనేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం గురించి తెలుసుకొని తమ్ముడు దరఖాస్తు చేసిండు. స్కాలర్షిప్ మంజూరైంది. ఇప్పుడు లండన్‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నడు. మాలాంటి రైతు కుటుంబాలకు సీఎం అన్నిరకాలుగా అండగా నిలుస్తున్నరు. స్కీం లేకపోతే నా తమ్ముడు విదేశాలకు వెళ్లేవాడుకాడు. సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్.
-బాసాని సందీప్‌రెడ్డి, రాణిపురం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా
ఫ్లైట్ టికెట్‌కూ పైసలు ఇచ్చిండ్రు
ఇన్నాళ్లు డబ్బులున్నోళ్లే విదేశాల్లో చదువుకునేటోళ్లు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని మాలాంటి సాధారణ కుటుంబాల బిడ్డలు సైతం విదేశాల్లో చదువుకొనే అవకాశం వచ్చింది. నేను సాధారణ రైతును. నా కొడుకు చిందం అశోక్ లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెర్డ్ షైర్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తుండు. ఓవర్సీస్ పథకం కింద మొదటి విడత రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు ఫ్లైట్ టికెట్‌కు రూ.60 వేలను కూడా సర్కారే ఇచ్చింది. మరో రూ.10 లక్షలు త్వరలో వస్తాయని అధికారులు చెప్పిన్రు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పేదకుటుంబాల పిల్లలకు ఉన్నత చదువును విదేశాల్లో సదువుకునే అవకాశం వచ్చింది. నా లాంటి పేద కుటుంబాల బిడ్డలకు అండగా నిలుస్తున్న కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేనిది.
-చిందం కిష్టయ్య, రైతు, అల్గునూరు, కరీంనగర్ జిల్లా
కేసీఆర్ వల్లే పైసలొచ్చినయ్
బాగా పైసలున్నోళ్లే విదేశాలకు పోయి చదువుకొంటరు అనుకొన్నా. మాలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నది. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. మధ్యతరగతి కుటుంబం. నా పెద్ద కుమారుడు ప్రవీణ్‌కు విదేశాల్లో చదువాలని కోరిక. తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా అర్హత సాధించాడు. నిరుడు మొదటి విడత రూ.10 లక్షలు అందించింది. త్వరలో రూ.10 లక్షలు ఇస్తమని చెప్పిండ్రు. ప్రస్తుతం అమెరికాలోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
-మలావత్ మాన్సింగ్, పాకాల, నిజామాబాద్ జిల్లా
కేసీఆర్ వల్లే విదేశాల్లో కొలువు
మేం పెద్ద చదువులు సదువకున్నా పిల్లలను బాగా చదివించాలనుకొన్నం. మాది మహబూబాబాద్ జిల్లా మరిపెడ. నా రెండో కుమారుడు లక్ష్మీపతి చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండే వాడు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. విదేశాల్లో ఎంఎస్ చేయాలని చెప్పగా బాగా ఖర్చు అవుతదని చెప్పిండ్రు. అప్పుల కోసం తిరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2019లో విదేశీ విద్యకు రూ.20 లక్షలు అందజేస్తుందని ప్రకటించింది. వెంటనే దరఖాస్తు చేయగా రూ.20 లక్షలతోపాటు వీసా, విమాన టికెట్ డబ్బులు ఇచ్చింది. సీఎం కేసీఆర్ అందించిన తోడ్పాటుతో విదేశాల్లో స్థిరపడాలన్న నా కొడుకు కోరిక నెరవేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జాబ్ చేస్తున్నడు. విదేశీ విద్య పథకం ద్వారా ఆదుకొన్న సీఎం కేసీఆర్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు రుణపడి ఉంటాం.
– గంధసిరి అంబరీశ-పద్మ, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా
ప్రభుత్వ సహకారం మరువలేనిది
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. రైస్‌మిల్లు డ్రైవర్‌గా పనిచేస్తున్న. ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు శ్రీనివాస్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాలని కోరిక. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కొడుకును ఎలాగైనా అమెరికా పంపించాలనుకొన్న. అప్పుల కోసం చాలాచోట్ల తిరిగిన. విదేశీ విద్యకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుందని తెలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేయగా మంజూరైంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో నా కొడుకు అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. తమ లాంటి పేదల విదేశీ విద్య కోరిక తీర్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-కొమ్మన పట్టాభిరాం, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా
ఓవర్సీస్ పథకం పెద్ద దిక్కయ్యింది
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం మాకు పెద్ద దిక్కు అయ్యింది. ఇద్దరు బిడ్డల విదేశీ చదువుకు అవసరానికి వచ్చింది. మాది వ్యవసాయం కుటుంబం. పంటలు సాగవుతేనే పైసలు వచ్చేది. ఇద్దరు పిల్లలను విదేశాలకు పంపించాలని ఉన్నా ఆర్థికంగా సహకరించలేదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓవర్సీస్ పథకం ద్వారా పిల్లల విదేశీ చదువుల కల సాకారం అయ్యింది. రెండు విడతలుగా రూ.20 లక్షల లోన్ మంజూరైంది. వీటితోపాటు ఫ్లైట్ టికెట్ ఖర్చులు ఇచ్చిండ్రు. నా కుమార్తె స్టెల్లామేరి ఈ పథకం ద్వారా లండన్‌లో ఉన్నత చదువు చదువుకొని ప్రస్తుతం అక్కడే జాబ్ చేస్తున్నది. రాజకీయ పైరవీలు, రూపాయి ఖర్చు లేకుండా స్కాలర్షిప్ మంజూరైంది. మధ్యతరగతి కుటుంబాలకు ఫారిన్ ఎడ్యుకేషన్ పథకం ఎంతో బాగున్నది.
-గాదె రాజారెడ్డి, రామచంద్రాపురం, ములుగు జిల్లా
సార్‌ను యాదికుంచుకొంటం
మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపురం. అమ్మానాన్న ఉప్పలయ్య-బాలమణి చదువుకోలేదు. మమ్ముల్ని బాగా చదివించాలని కష్టపడ్డారు. ఇద్దరు ఊరూరూ తిరుగుతూ రాతెండి సామాను విక్రయిస్తుంటారు. పనిచేస్తేనే పైసలొచ్చేది. నేను స్కాలర్‌షిప్‌లతో చదువు పూర్తి చేసిన. బీటెక్ అయిపోయింది. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్తానంటే ఆర్థికస్థోమత లేదని తల్లిదండ్రులు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన విదేశీ విద్యపరీక్షలో అర్హత సాధిం చా. ఓవర్సీస్ పథకం కింద రెండుసార్లు రూ.10 లక్షల చొప్పున ఇచ్చిండ్రు. ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ డాటాసైన్స్ చదువుతున్నా. సీఎం కేసీఆర్ చొరవతో విదేశీ చదువును పూర్తి చేయగలుగుతున్నా. కేసీఆర్ సార్ అందించిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొంటా.
-చెన్నూరి ఝాన్సీరాణి, ఆలీంపురం,బచ్చన్నపేట, జనగామ జిల్లా
కేసీఆర్ సార్‌కు థ్యాంక్స్
మాది నిరుపేద దళిత కుటుంబం. అష్టకష్టాలు పడి డిగ్రీ వరకు చదువుకున్నా. ముగ్గురు పిల్లలు. పిల్లలనైనా విదేశాల్లో ఉన్నత చదువులు చదివించాలని బలమైన కోరిక వెంటాడేది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తోడ్పాటు అందించింది. చిన్న కొడుకు కల్యాణ్‌కుమార్ ఆర్నెల్ల కిందట అమెరికాకు చదివేందుకు వెళ్లాడు. కాలేజీ ఫీజులో రూ.20 లక్షల స్కాలర్షిప్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం రూ.10 లక్షల విడుదల చేసింది. త్వరలో మరో రూ.10 లక్షలు చెల్లించనున్నది. నేను బీజేపీ కౌన్సిలర్‌ను అయినా ఎక్కడా పక్షపాత ధోరణితో చూడలేదు. సీఎం కేసీఆర్ సార్‌కు నిజంగా థ్యాంక్స్.
-బొట్ల శ్రీనివాస్, బీజేపీ 30వ వార్డు కౌన్సిలర్, జనగామ
పెద్ద దిక్కు అయ్యిండు
మాది హనుమకొండ జిల్లా ఎలుకుర్తి. ఇద్దరం ప్రైవేటు జామ్ చేస్తు న్నం. మాకు ముగ్గురు కూతుళ్లు. పె ద్ద కూతురు విశాలి దివ్యాంగురాలు. రెండో కూతురు నీలిమ కిట్స్‌లో బీటె క్ పూర్తి చేసింది. ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే 20 లక్షలు, విమానం, వీసా ఖర్చులు ఇచ్చిండ్రు. నీలిమ 2021 డిసెంబర్ 16న అమెరికాకు పోయింది. ముగ్గురు పిల్లలను ఎట్లా చదివిత్తామో అని భయమైంది. పెద్ద కూతురు పెండ్లికి కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇచ్చిండు. రెండో కూతురు బయటి దేశాల్లో చదువుకొనేందుకు సాయం చేసిండు.
-రాజారపు వెంకటరత్నం-రాజేశ్వరి, ఎలుకుర్తి, ధర్మసాగర్, హనుమకొండ
ఆపద్బాంధవుడు కేసీఆర్
మాది భువనగిరిలోని హనుమాన్వాడ. నా కూతురు హారిక నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని వైద్య కళాశాలలో 4 ఏండ్ల కిందట బీడీఎస్ పూర్తి చేసింది. కెనడాలో పీజీ చేయాలని చెప్పింది. ఇందుకు రూ.26 లక్షల ఖర్చు అవుతదన్నది. ఎలాగైనా చదువు ఆపవద్దని బయట అప్పు తెచ్చి కెనడాకు పంపినం. ఆమె వెళ్లిన కొన్ని రోజులకు విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకోగా..రూ.20 లక్షల లోన్ మంజూరైంది. దాంతో ఊపిరి పీల్చుకున్నాం. ఆ డబ్బుతో బయట తెచ్చిన అప్పులు తీర్చేశాం. ప్రస్తుతం నా కూతురు కెనడాలో పీజీ చేస్తూనే పార్ట్‌టైంలో డెంటల్ ప్రాక్టీస్ చేస్తూ కొంత డబ్బు సంపాదిస్తున్నది. ఇందుకు సహాయం చేసిన సీఎం కేసీఆర్‌ను జీవితాంతం మరిచిపోం.
– పంగరెక్క లలిత, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా