హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప సినిమా నిర్మాతలు రూ.2 కోట్లు సాయం అందించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, పుష్ప-2 నిర్మాత రవిశంకర్‌తో కలిసి బుధవారం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. రూ.1.5 కోట్ల చెక్కును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందించారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ తరఫున రూ.50లక్షలు అందించినట్టు తెలిపారు. ఇప్పటికే ఇందులో మైత్రీ మూవీస్ రూ.50లక్షల చెక్కును రేవతి భర్త భాస్కర్‌కు అందించినట్టు వివరించారు. బాధితుడికి నేరుగా సాయం అందిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని, అందుకే బాధితుడిని నేరుగా కలవలేకపోతున్నానని ఎఫ్డీసీ ద్వారా సాయం అందించినట్టు చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోల్కొంటున్నాడని తెలిపారు. వెంటిలేషన్ తీసేశారని వివరించారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడిందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. అతడి పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపినట్టు పేర్కొన్నారు. అల్లు అరవింద్ అందించిన సాయం రేవతి కుటుంబానికి అన్ని విధాల ఉపయోగపడేలా చూస్తామని తెలిపారు.