MLC Elections | హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది. దీంతో మూడు నియోజక వర్గాలలో కలిపి మొత్తం 192 నామినేషన్లు దాఖలయ్యాయని సమాచారం. అయితే పూర్తి స్థాయి సమాచారం ఇంకా రాలేదని, త్వరలోనే నామినేషన్లకు దాఖలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తామని సీఈవో తెలంగాణ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ నిర్వహించారు. అయితే దాఖలు చేసిన నామినేషన్లు ఉపసంహారించుకోవడానికి ఈ నెల 13 వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తమ ప్రచారం జోరు పెంచారు. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ నియోజక వర్గాలకు ఈ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.