హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా గురువారం మరో 5,962 మంది టీచర్లు పదోన్నతులు పొందారు. మల్టీజోన్ -2లో హైదరాబాద్, రంగారెడ్డి సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. టీచ ర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 18,942 మంది టీచర్లకు పదోన్నతులు దక్కాయి. వీరిలో గ్రేడ్ -2 భాషాపండితులు, పీఈటీలు 4,200కుపైగా ఉన్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ గ్రేడ్ -2 భాషాపండితులు, పీఈటీల అప్గ్రేడేషన్ ప్రక్రి య పూర్తయ్యింది.
తాజా పదోన్నతుల్లో వీరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఉత్తర్వులు అందుకొన్న టీచర్లంతా గురువారమే కొత్త స్థానాల్లో చేరారు. అయితే గురువారంతో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. ఇక రెండు మల్లీజోన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు చేపట్టాల్సి ఉన్నది. దీంతో టీచర్ల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ ముగియనున్నది. అయితే, మల్టీజోన్ -2లోని 12 జిల్లాల్లో 5,962 మందికి పదోన్నతులు లభించగా, రెండు కంటే ఎక్కువ పదోన్నతులు పొందిన వారు 806 మంది ఉన్నారు. వీరు ఒకే పోస్టును ఎంపికచేసుకోవాల్సి ఉండటంతో ఆయా పోస్టులు మిగిలే అవకాశం ఉన్నది. ఆపోస్టులను ఇతరులతో భర్తీచేయాలని టీచర్లసంఘాల నేతలు కోరుతున్నారు.
భాషాపండితుల అప్గ్రేడేషన్ పట్ల రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్యూపీపీటీఎస్) హర్షం వ్యక్తం చేసింది. దశాబ్దాల కలను సాకారం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. తాజా పదోన్నతులతో టీచర్లలో సంతోషకరమైన వాతావరణం నెలకొన్నదని పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్, ప్రధానకార్యదర్శి నర్సిములు అభిప్రాయపడ్డారు. 2017లో ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ హామీనిచ్చినప్పటి నుంచి అప్గ్రేడేషన్ కోసం తాము ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనూ భాషాపండిత వ్యవస్థను ప్రవేశపెట్టి కొత్త పోస్టులను క్రియేట్చేయాలని, ఉన్నత పాఠశాలల్లో తెలుగుకు వారానికి 9, హిందీకి 6 పీరియడ్లు కేటాయించాలని కోరారు.