దుబ్బాక, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం టెండర్లలో భారీ అవినీతికి పాల్పడిందని, ఇందులో రూ.1,600 కోట్లను ఎన్నికల ఖర్చుల కోసం ఢిల్లీకి తరలించేందుకు కుట్ర జరుగుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. పేదల ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. విలువైన ధాన్యాన్ని తక్కువ ధరకు కోట్ చేయించి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఒక్కో క్వింటాల్‌కు రూ.450 చొప్పున మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యానికి రూ.1,600 కోట్ల అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ డబ్బును ఎన్నికల ఖర్చుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ పెద్దలకు ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపించారు. కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి, ఎంపీపీ పుష్పలతా కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.