Balagam | ఓదెల, జూన్ 11: ఆస్తి తగాదాలు, ఇతరత్రా విభేదాల కారణంగా ఎన్నో ఏండ్లుగా మాటలు లేక దూరంగా ఉంటున్న ఎన్నో కుటుంబాలు బలగం సినిమాతో ఒక్కటవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఇరగోని మల్లయ్య-ఆగవ్వ దంపతుల కుటుంబీకులు విభేదాలను విడిచి ఒక్కటయ్యారు. దాదాపు 156 మంది గల సభ్యులు వివిధ కారణాల వల్ల మనస్పర్థలు వచ్చి చాలాకాలంగా ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు.
ఇందులో కొందరు బలగం సినిమాను స్ఫూర్తిగా తీసుకొని అందరినీ కలిపేందుకు ప్రయత్నించగా అది విజయవంతమైంది. వేర్వేరుచోట్ల స్థిరపడిన ‘ఇరగోని’ కుటుంబ సభ్యులంతా ఆదివారం స్వగ్రామంలో కలుసుకొన్నారు. మల్లయ్య- ఆగవ్వ ఇంట్లో కొడుకులు, కోడళ్లు, బిడ్డలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, ఇతర బంధువులు అంతా సమావేశమయ్యారు. అంతా కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలను శాలువాలతో సన్మానించారు. నృత్యాలు చేస్తూ రోజంతా సంతోషంగా గడిపారు.