పెద్దపల్లి, జూన్ 20 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల చరిత్ర కలిగి ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి వెలుగులు పంచిన 62.5 మెగావాట్ల పెద్దపల్లి జిల్లా రామగుండం బీ థర్మల్ విద్యుత్తు కేంద్రం నేడో రేపో మూతపడనున్నది. 1965లో రూ.14.8 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ అభివృద్ధి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఆర్థిక సాయంతో 62.5 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. బీ-థర్మల్ ప్లాంట్‌ను నెలకొల్పిన 13 ఏండ్ల తర్వాత దీని సరిహద్దును ఆనుకొనే 1978లో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కి పునాది రాయి వేసింది. 1983లో కేవలం 200 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన కార్పొరేషన్.. దశలవారీ విస్తరణతో ప్రస్తుతం 2600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుని దక్షిణ భారత దేశం మొత్తానికి వెలుగులు పంచుతున్నది. అయితే.. బీ థర్మల్ ప్రాజెక్టు జీవితకాలం 50 ఏండ్లు. కానీ ప్లాంట్ ఏర్పాటు చేసి 59 ఏండ్లు కావడంతో తరచూ సమస్యలు వస్తున్నాయి. ప్లాంటు నిర్వహణ భారంగా మారింది. బాయిలర్, టర్బయిన్, మిల్స్, ట్రాన్స్ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా క్రమం తప్పకుండా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బాయిలర్లలో ఈ నెల 5న సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాజాగా యూనిట్ ట్రిప్ అయ్యి విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతులకు, రిపేర్లకు విద్యుత్తు సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు.
దీంతో విద్యుత్తు ఉత్పత్తి పునరుద్ధరణకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతుండగా.. ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండటంతో మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టులో మొత్తంగా 803 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్లాంట్ మూతపడనున్న నేపథ్యంలో జెన్కో సీఎండీ రిజ్వి ఈ నెల 13న 38 మంది ఇంజినీర్లు, ఐదుగురు సబ్ ఇంజినీర్లు, సీనియర్ కెమిస్ట్, నలుగురు కెమిస్ట్‌లను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో డిప్యూటేషన్ ఉత్తర్వులను రద్దు చేశారు. రాష్ట్రంలోని వివిధ పవర్ ప్లాంట్లలో పనిచేసేందుకు వారి ఇష్టం మేరకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు మాత్రం అవకాశం ఇస్తూ మరో ఉత్తర్వును జారీ చేశారు. రామగుండం బీ థర్మల్ విద్యుత్తు కేంద్రానికి కాలం చెల్లడంతో అదే స్థానంలో 800 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం ఉన్న కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్థానికంగా వినిపిస్తున్నది. అప్పటి వరకూ పాత విద్యుత్తు ప్లాంటును కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.