హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన 14 రవాణా చెక్‌పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించాలని కేంద్రం గతంలోనే సూచించగా.. పలు రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న చెక్‌పోస్టులను తొలగించుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. వాహనాల ప్రయాణంలో, సరకుల రవాణాలో ఆలస్యాన్ని తగ్గించి సజావుగా రవాణా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో చెకోపోస్టుల రద్దుకు రవాణాశాఖ నుంచి ప్రతిపాదన రాగా.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇకపై వాహనాల పన్ను, తాత్కాలిక పర్మిట్లు, రుసుముల చెల్లింపుల ప్రక్రియ ఆన్లైన్లో చెల్లించుకోవచ్చని రవాణాశాఖ అధికారులు చెప్పారు. దీంతో 14 చెక్‌పోస్టులతోపాటు కామారెడ్డి చెక్ పాయింట్‌ను తొలగించనున్నారు. అవసరమైతే మొబైల్ స్వాడ్లను నియమించాలని రవాణాశాఖ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది. నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించేందుకు ఏఎన్పీఆర్ కెమెరాలను(ఆటో నంబర్ ప్లేట్ రీడర్)ఏర్పాటుచేస్తారు. ప్రయోగాత్మకంగా కామారెడ్డి చెక్‌పోస్టు దగ్గర ఏఎన్పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా, చెక్‌పోస్టులను ఎప్పటినుంచి తొలగించాలనే అంశంపై అధికారులు నేటికీ నిర్ణయం తీసుకోలేదు.