హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు రాబోయే 10 -15 రోజుల్లో వైస్చాన్స్లర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 135 మందికి సోమవారం సచివాలయంలో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష పెద్ద మొత్తం కాకపోవచ్చని, కానీ ప్రభుత్వం మీ వెనుక ఉందనే ఆత్మవిశ్వాసం కల్పించడానికి ఇస్తున్నామని చెప్పారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, గ్రూప్ -1, 2, 3, డీఎస్సీతో కలిపి మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతిగృహాలన్నీ ఒకే చోట ఉండేలా వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం వృథా కాకుండా 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 20వేల మందికి శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఒలింపిక్స్‌లో పెద్దసంఖ్యలో పతకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, గండ్ర సత్యనారాయణరావు, గడ్డం వివేక్‌వెంకటస్వామి, డాక్టర్ కవ్వంపల్లి సత్యానారాయణ, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీ, సింగరేణి సీఎండీ బలరాం, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
సొమ్మొకరిది.. సోకొకరిది
సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) కింద సింగరేణి సంస్థ సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది. కాగా, ఆ చెక్కులను అభ్యర్థులకు అందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ఖాతాలో వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.