Group-1 Mains | హైదరాబాద్, ఏప్రిల్ 4 ( నమస్తే తెలంగాణ ) : ‘ఎవుసం అంటే ఏమిటి?. పునాస అర్థం ఏమిటి.. ఆనపకాయ అని దేనినంటారు. ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజు ఆడుకుంటారు.. పగిడిద్దరాజు ఎవరి భర్త.. మలీద ముద్దను దేనితో తయారుచేస్తారు’ అన్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. కనీసం వాటిగురించి అవగాహన కూడా లేదు. కానీ వారంతా గ్రూప్-1మెయిన్‌లో టాపర్లుగా నిలిచారు. నాన్‌లోకల్ అభ్యర్థులుగా వచ్చి.. అన్నీ తెలిసిన, అన్నింటిపై సమగ్ర అవగాహన ఉన్న తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను కొల్లగొట్టబోతున్నారు. దీనికంతటికి కారణంగా కాంగ్రెస్ సర్కారు నిర్వాకమే. నీళ్లు. నిధులు.. నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్. కానీ కాంగ్రెస్ పాలనలో స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. ఇప్పటికే కృష్ణా నీళ్లను ఏపీ కొల్లగొట్టింది. తాజాగా ఉద్యోగాలు సైతం ఏపీ వాళ్ల సొంతమవుతున్నాయి. అత్యంత కీలకమైన, ఎంతో ప్రాధాన్యం గల గ్రూప్-1 పోస్టులను పల్లెంలో పెట్టి వడ్డించినట్టుగా ఏపీ అభ్యర్థులకు కట్టబెడుతున్నది. ఇలా ఏకంగా 13 మంది మన దగ్గర కొలువులు కొల్లగొట్టబోతున్నారు. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 మెయిన్ టాపర్లలో 13 మంది ఏపీ అభ్యర్థులున్నారు. వీరిలో ఎనిమిది మంది ఓసీలే ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు ఈడబ్ల్యూఎస్‌ను క్లెయిమ్ చేశారు. ఎస్సీలు ఒక్కరు మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) వంటి కీలక ఉద్యోగాలను ఏపీ అభ్యర్థులు దక్కించుకోబోతున్నారు. వీరంతా టాప్-500లోపు ర్యాంకుతో ఉండ టం తెలంగాణ అభ్యర్థులను కలవరపరుస్తున్న ది. ఇదేం పరీక్ష.. ఇవేం ఫలితాలు అన్న ప్రశ్న లు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
టాపర్లుగా నిలిచిన నాన్‌లోకల్ అభ్యర్థులు కొన్ని ఎంపికచేసిన సెంటర్ల నుంచే ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. ఒక్కో సెంటర్ నుంచి ఇద్దరు చొప్పున నాన్ లోకల్ అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. దీంతో ఏదో స్కాం జరిగే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెంటర్-7 నుంచి ఇద్దరు టాపర్లుండగా, ఒకరికి 535, మరొకరికి 512.50 మార్కులొచ్చాయి. సెంటర్ -8లోను ఇద్దరున్నారు. వీరిలో ఒకరికి 505 మార్కులు, మరొకరికి 369 మార్కులొచ్చాయి. సెంటర్ 12 నుంచి సైతం ఇద్దరు, 46 నుంచి ఇద్దరు చొప్పున నాన్ లోకల్ అభ్యర్థులు అత్యధిక మార్కులు సాధించారు. మెయిన్ పరీక్షలను నిర్వహించిన సెంటర్లలో ర్యాండమ్‌గా టాపర్లుండాలి. కానీ ఒకే సెంటర్లో అది నాన్‌లోకల్ అభ్యర్థులెలా ఉంటారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివెనుక ఏదో తతంగం జరిగి ఉంటుందని అభ్యర్థులు అనుమానిస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్‌లో రోజుకో బాగోతం వెలుగుచూస్తుండటంతో నిరుద్యోగుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-1 మెయిన్ పేపర్‌ను లీక్ చేశారా? లేక కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే సెంటర్ నుంచి టాపర్లు ఉండటమంటే పేపర్ లీకేజీ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గతంలో గ్రూప్-1 మెయిన్‌కు అంతా సిద్ధమయ్యాక పేపర్ లీకేజీతో పరీక్ష రద్దయ్యింది. అప్పుడు రూపొందించిన ప్రశ్నపత్రాలను ఏడాదిన్నర తర్వాత తాజాగా వాడినట్టు అభ్యర్థులు అనుమానిస్తున్నారు. టీజీపీఎస్సీలో పనిచేసిన వారే ప్రిలిమ్స్ పేపర్ లీకేజీలో పాత్రధారులుగా ఉన్నారు. అప్పుడెప్పుడో రూపొందించిన మెయిన్ ప్రశ్నపత్రం సైతం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి ఉంటుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
మన ఉద్యోగాలు మనకే దక్కాలన్న ఆశయంతో టీజీపీఎస్సీ గత పదేండ్ల కాలంలో అనేక వ్యూహాత్మక ఎత్తుగడలను అనుసరించింది. ముఖ్యంగా తెలంగాణ వ్యవహారిక భాష, పదజాలం, వేషధారణ, ఆహారం, సంస్కృతి, పండుగలు, సినిమాలు, జాతరలు వంటి అంశాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలిచ్చింది. తెలంగాణ ఉద్యమంపైనా అప్పుడప్పుడు ప్రశ్నలను సంధించింది. మన పిల్లలకు ఉద్యోగాలు దక్కడంతో పాటు, ఇతర రాష్ర్టాల వారిని అడ్డుకోవడం దీని వెనుకున్న అంతరార్ధం. కానీ కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత నిర్వహించిన గ్రూప్-1 సహా అనేక పోటీ పరీక్షల్లో తెలంగాణ అంశాలపై అంతగా ప్రశ్నలివ్వడం లేదు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తెలంగాణ అంశాలపై ఇచ్చిన ప్రశ్నలు చాలా స్వల్పం. ఇలా టీజీపీఎస్సీ పరోక్షంగా ఏపీ అభ్యర్థులకు సహకారం అందించిందని నిరుద్యోగ జేఏసీ నేతలంటున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశ్నలివ్వాల్సి వస్తుందన్న కారణంతో ఆ ప్రశ్నల జోలికెళ్లడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం పుస్తకాల్లోని అంశాలపైనే ప్రశ్నలిస్తూ వస్తున్నారు. దీంతో తెలంగాణ సిలబస్‌ను చదువుకున్న అభ్యర్థులకు అన్యాయం జరగగా, వీటిపై ఏ మాత్రం అవగాహన లేని ఏపీ అభ్యర్థులకు గేట్లు తెరిచినట్లయ్యింది.
గ్రూప్-1 ఉద్యోగాల్లోకి ఏపీ అభ్యర్థుల రాకను కేవలం ఉద్యోగాలు కొల్లగొట్టడమన్న ఒక్క కోణంలోనే చూడొద్దని నిరుద్యోగ జేఏసీ నేతలంటున్నారు. ఇది మనకు మనమే మన భవిష్యత్తును నాశనం చేసేందుకు పునాదులు వేసుకున్నవాళ్లమవుతామని గ్రహించాలంటున్నారు. గ్రూప్-1 అంటేనే సివిల్ సర్వీసెస్ స్థాయి పోస్టులు. వీటిలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఎంపీడీవో వంటి కీలక పోస్టులున్నాయి. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు ఓ పదేండ్ల తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లవుతారు. ఎంపీడీవోలు జెడ్పీ సీఈవోలవుతారు. ఈ పోస్టులకున్న ప్రాధాన్యం మనకు తెలిసిందే. పరిపాలనలో ఇవే అతి ముఖ్యమైనవి. ఇప్పటికే అనేక అంశాల్లో మన పక్క రాష్ట్రం ఏపీతో మనకు లొల్లినడుస్తున్నది. కృష్ణాజలాలు, విద్యుత్తు, వనరుల పంపిణీ వంటి అనేక అంశాల్లో రెండు రాష్ర్టాల మధ్య వివాదాలున్నాయి. రేపు ఇదే అధికారులు సర్కారులో కీలకమయితే ఏపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాల్లేకపోలేదు. ఇదే జరిగితే తెలంగాణ భవిష్యత్తును పణంగా పెట్టినట్టేనని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.