శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 01:38:48

గిరిజనుల ఉపాధికి 13.84కోట్లు!

గిరిజనుల ఉపాధికి 13.84కోట్లు!
  • హైపవర్‌ కమిటీ ప్రతిపాదనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలోని గిరిజన యువత ప్రగతికి సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పథకం ద్వారా ఆర్థికసాయం అందించనున్నారు. వారి స్వయంఉపాధికి వ్యాపార కేంద్రాలు, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటుచేసుకొనేందుకుగాను గిరిజనసంక్షేమశాఖ ద్వా రా రూ.13.84 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఈ పథకం అమలుకు ఉద్దేశించిన హైపవర్‌ కమిటీ ఇటీవలే సమావేశమై ప్రతిపాదనలు రూపొందించింది. ఈ మొత్తంలో లబ్ధిదారులకు రూ.4.78 కోట్లు సబ్సిడీ ఇవ్వనుండగా, బ్యాంకు రుణం ద్వారా రూ.7.68కోట్లు అందజేయనున్నారు. ఇందులో లబ్ధిదారుల వాటా కింద రూ.1.38 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఈ హైపవర్‌ కమిటీలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, స్టేట్‌లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ, డీఐసీసీఐ, ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఐసీ, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌, గిరిజన ఆర్థిక సహకార సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి కల్పన, ఆర్థిక సహకార కార్యక్రమాల ను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ప్రత్యేకంగా ప్రతిపాదనలు తయారుచేసింది. గిరిజనులు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.logo