సంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నిర్ఫ్లో 12వ ర్యాంకు సాధించి మెరిసింది. గత రెండేండ్లలో ఐఐటీహెచ్ నిర్ఫ్ ర్యాంకింగ్ 14 ఉండగా ఈ ఏడాది 12వ ర్యాంకు వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్(నిర్ఫ్) ఏటా దేశంలోని విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు, పరిశోధనల సంస్థల విద్యాబోధన, పనితీరు, పరిశోధనలు, ఫలితాలు తదితర అంశాలను మదించి ర్యాంకులను కేటాయిస్తుంది. 2024కు నిర్ఫ్ సోమవారం ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఐఐటీహెచ్ మెరిసింది. ఓవరాల్ ర్యాంకింగ్లో ఐఐటీహెచ్ 12వ ర్యాంకు సాధించింది. 2022, 2023లో ఓవరాల్ ర్యాంకింగ్లో ఐఐటీహెచ్ 14వ స్థానంలో నిలిచింది. నిర్ఫ్ ఆవిష్కరణల క్యాటగిరీల్లో ఐఐటీహెచ్ 3వ ర్యాంకు, నూతన ఆవిష్కరణల్లో మొదటి స్థానంలో ఉండగా తాజా నిర్ఫ్ ర్యాంకింగ్లో మూడవ స్థానంలో నిలిచింది. దేశంలోని టాప్ 50 పరిశోధన సంస్థల్లో ఐఐటీహెచ్కు 15వ ర్యాంకు వచ్చింది. దేశంలోని 100 ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ఐఐటీహెచ్కు 8వ ర్యాంకు వచ్చింది.