హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): అవయవదానం వల్ల మరొకరికి జీవితం ప్రసాదించవచ్చని మరోమారు నిరూపించారు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు. వైద్యులు 12వ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను పద్మావతి దవాఖానలో విజయవంతంగా పూర్తి చేశా రు. శ్రీకాకుళం జిల్లా రాజోలుకు చెందిన కే ధర్మారావు(28) రోడ్డు ప్రమాదంలో తీవ్రం గా గాయపడటంతో అక్కడి జెమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో వైజాగ్‌కు చెందిన 42 ఏండ్ల వ్యక్తి డైలేటెట్ కార్డియోమయోపతి వ్యాధితో గుండెపోటుకు గురయ్యే స్థితిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స పొందుతున్నాడు.
అవయవదానం సమాచారం అందుకున్న శ్రీపద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి గుండె మార్పిడికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు వైద్యబృందం గుండె ను సేకరించి ప్రత్యేక ఏర్పాట్లతో శ్రీకాకుళం రాజోలు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్డు మార్గంలో వైజాగ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 10.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నా రు. విమానాశ్రయం నుంచి రాత్రి 10.05 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు శ్రీపద్మావతి చిన్నపిల్లల దవాఖానకు తరలించి ఈ నెల 27న తెల్లవారుజామున 4 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.