హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): యువత ఆలోచనలు, ఇన్నోవేషన్లు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కితాబిచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఎస్ఎఫ్సీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఐడియాథాన్-2024కు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. బేగంపేటలోని హరితప్లాజాలో శనివారం నిర్వహించిన ఐడియాథాన్ విజేతలకు అవార్డుల ప్రదానోత్సంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం మంచి ఆలోచనలను ప్రజల నుంచే స్వీకరించాలనే ఉద్దేశంతో ‘ఐడియాథాన్’ నిర్వహించామని, దేశ, విదేశాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1200 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 12 ప్రాంతాల నుంచి 47 మంది 29 రకాల ఆలోచనలను ఆర్థిక సంఘం ముందు నాలుగు రౌండ్లలో పంచుకున్నారని తెలిపారు. అక్టోబర్ 1న చివరి రౌండ్‌తో ఐడియాలపై చర్చ ముగిసిందని, ఫైనల్ విజేతలను ఎంపికచేశామని చెప్పారు. మొదటి 4స్థానాల్లో నిలిచిన బృందాలకు చైర్మన్ రాజయ్య, కలెక్టర్లు అవార్డులు అందజేశారు. ఎస్ఎఫ్సీ మెంబర్ సెక్రటరీ స్మితాసబర్వాల్, సభ్యులు నెహ్రూనాయక్, రమేశ్, సుధీర్‌రెడ్డి, పంచాయతీరాజ్, శాఖ కమిషనర్ అనితారామచంద్రన్, శార్ప్ సెక్రటరీ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతిలో ట్రాక్టర్ ట్రాలీ ఇవ్వడంతో గ్రామంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాం. సెగ్రిగేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి తడిచెత్తతో వర్మికంపోస్టు తయారుచేసి ఆదాయం ఆర్జిస్తున్నాం. వర్మీకంపోస్ట్ చేసి అమ్మగా రూ.10 లక్షలు ఆదాయం వచ్చింది. పొడి చెత్తతో రూ.71,000 వచ్చింది. నాలుగేండ్లలో చెత్త ద్వారా వచ్చిన రూ.10.71 లక్షల ఆదాయంతో గ్రామంలో 5 లక్షలతో సోలార్ ప్లాంట్ పెట్టి 6కేవీ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. గతంలో నెలకు రూ.10-12 వేల కరెంట్ బిల్ వస్తుండె. ఇప్పుడు జీరో బిల్ వస్తున్నది.
– గాడ్గె మీనాక్షి, ముక్రా (కే) తాజా మాజీ సర్పంచ్, ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా