హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పీహెచ్డీ పూర్తి చేసేందుకు సాధారణంగా ఐదేండ్ల సమయం పడుతుంది. కానీ ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ కనీసం ఏడెనిమిదేండ్లు ఎదురుచూడాల్సిందే. గైడ్‌తో సత్ప్రవర్తనతో మెలిగి, అన్ని రకాలుగా అణిగిమణిగి ఉంటేనే ఎనిమిదేండ్లలోపు పీహెచ్డీ పట్టా చేతికొస్తుంది. చిన్న తేడా వచ్చినా ఆ స్కాలర్ కనీసం పదేండ్లు యూనివర్సిటీలో మగ్గాల్సిందే. అలాంటి వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు.
విద్యార్థులు పట్టుదలతో చదివి పీహెచ్డీ సీటు సంపాదిస్తారు. విద్యార్థులను ప్రొఫెసర్లు, డీన్లు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అందుకు పూర్తిగా భిన్నమనే అభిప్రాయముంది. ఐదేండ్లపాటు కష్టపడి రాసిన పరిశోధన పత్రాలను సూపర్వైజర్లకు సమర్పించేందుకే నెలలు, సంవత్సరాల సమయం పడుతున్నది. ఎలాంటి తప్పిదాలు లేకున్నా థీసిస్‌ను ఆమోదించకపోవడంతో స్కాలర్లు మనోవేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు యత్నించిన విద్యార్థులు కూడా ఉన్నారు.
హెచ్‌సీయూలో పీహెచ్డీ స్కాలర్ల పరిశోధన పత్రాలకు ఆమోదం తెలపకుండా కొంతమంది ప్రొఫెసర్లు అడ్డుపడుతున్నట్టు సమాచారం. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగోన్నతులు రావాలంటే పీహెచ్డీ స్కాలర్ల థీసిస్‌లను నిర్ణీత కాలవ్యవధిలో ఆమోదింపజేయాలి. కానీ ప్రొఫెసర్లకు అలాంటి నిబంధనలేమీ ఉండవు. దీంతో కొంత మంది ప్రొఫెసర్లు చిన్న కారణాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. థీసిస్‌లను ఎప్పటికప్పుడు ఆమోదిస్తే కొత్త వారు వస్తారు.
మళ్లీ వాళ్ల పరిశోధనలను చదవాలి. వారికి సలహాలు సూచనలు ఇవ్వాలి. రాసిన వాటిలో తప్పులను గుర్తించి సరిదిద్దాలి. దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ తమ వద్ద ఉన్న వారి పరిశోధన పత్రాలకు ఆమోదం కల్పించకుండా ఆపితే పనిభారం తగ్గుతుందనే భావనతో కొందరు వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఇబ్బందులకు గురిచేస్తున్న కొంతమంది ప్రొఫెసర్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని స్కాలర్లు కోరుతున్నారు.
2014 జూన్‌లో హెచ్‌సీయూలో 25 ఏండ్ల విద్యార్థి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో పీహెచ్డీ ప్రవేశం పొందాడు. 2018 జూన్‌లో తన పరిశోధన పత్రాలను సమర్పించాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో పరిశోధన పత్రాలపై వర్సిటీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరణను పట్టించుకోకుండా 2019 జనవరిలో అడ్మిషన్ క్యాన్సిల్ చేశారు. విద్యార్థి అకడమిక్ గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. న్యాయం జరగకపోవడంతో 2019 ఏప్రిల్‌లో ఎంహెచ్ఆర్డీని ఆశ్రయించాడు. మరో ఐదేండ్లలో పరిశోధన పత్రాలు సమర్పించుకునే అవకాశం విద్యార్థికి ఇవ్వాలని వర్సిటీని హెచ్ఆర్డీ ఆదేశించింది. వర్సిటీ అధికారులు సహకరించకపోవడం, కరోనా కాలం, ఇతర ఇబ్బందులతో ఆ విద్యార్థి తన పీహెచ్‌డీని పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరో యూనివర్సిటీలో చేద్దామన్నా అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొన్నది.