హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో దానాపూర్-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. భువనేశ్వర్-తిరుపతి, పూనే-భువనేశ్వర్, భువనేశ్వర్-బెంగళూరు, విశాఖపట్నం-నాందేడ్, సబల్పూర్-నాందేడ్, భువనేశ్వర్-న్యూఢిల్లీ స్టేషన్ల మధ్య నడుస్తున్న 18 ఎక్స్ప్రెస్ రైళ్లలో తాత్కాలికంగా అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నెల 4 నుంచి 31 వరకు ఆయా రైళ్లలో అదనపు బోగీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా స్టేషన్ల మధ్య ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
వయనాడ్ బాధితులకు విరివిగా విరాళాలివ్వండి: సీపీఎం
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : వయనాడ్ బాధితులను ఆదుకోవడానికి విరాళాలు అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ గురువారం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో పార్టీ శ్రేణులు ఆగస్టు 2,3,4 తేదీల్లో విసృ్తతంగా కదిలి విరాళాలు సేకరించి కేంద్రానికి పంపాల్సిందిగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. దాతలు పార్టీ కేంద్ర కార్యాలయం ‘వయనాడ్ ప్రత్యేక నిధి’ విరాళాల కోసం ఏర్పాటు చేసిన అకౌంట్కు పంపాలని తమ్మినేని వీరభద్రం సూచించారు.