Heavy Rains | భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలోని పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాలకు వెల్లే రహదారులు కొట్టుకపోవడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లేనని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఆయా గ్రామలకు వెళ్లే రాహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 33 గ్రామాలకు వెళ్లే రహదారులు దెబ్బతినగా.. కరీంనగర్లో 20 గ్రామాల రోడ్లు ధ్వంసమయ్యాయి. 20 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. మహబూబాద్లో 30గ్రామాలు, ఉమ్మడి మెదక్లో 8 గ్రామాలకు, నిజామాబాద్లో 7 గ్రామాలకు, నల్గొండలో 4 గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకపోయాయి.
ఇప్పటి వరకు కింది స్థాయి నుంచి అందిన సమాచారం మేరకు మొత్తం 117 గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీట మునగడంతో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల డామెజ్ను అధికారులు అంచనా వేయలేకపోయారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత దెబ్బతిన్న గ్రామీణ రోడ్లపై స్పష్టత వస్తుందని రూరల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అయితే, యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ రహదారుల పునురుద్ధరణ పనులను చేపట్టాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వర్షం తగ్గిన తర్వాత అంచనాలు సిద్ధం చేసి దెబ్బతిన్న గ్రామాల మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా తాత్కాలిక ప్రాతిపదికనైనా గ్రామీణ రహదారుల మరమ్మతులు చేపట్టి.. పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీగా కనకరత్నం తెలిపారు. వర్షం తగ్గు ముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామన్నారు.