హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నది. కొత్తగా నియమితులైన 113 మంది అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లతో రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నది.
వీరందరినీ క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని నిర్ణయించింది. వాహన తనిఖీల్లో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నది. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ (ఈ-ఎన్ఫోర్స్మెంట్) పరికరాల వాడకానికి ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మొత్తంగా రూ.8.4 కోట్లు కావాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నది.
రాష్ట్రంలో జరుగుతున్న అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగంగా డ్రైవింగ్ చేయడం, చాలా మంది వాహనదారులు వేగపరిమితులను పాటించకపోవడమే ప్రధాన కారణమని స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో నిరుడు 25,971 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. అధిక వేగంతో వాహనాలు నడిపేవారిపై ఏకంగా 11.31 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇలాంటి వారికి చెక్‌పెట్టేందుకు 40 స్పీడ్గన్లను కొనుగోలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది.
ఒకో స్పీడ్‌గన్‌కు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.2.8 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం వాహనాలను తనిఖీ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వెహికిల్ చెక్ రిపోర్ట్ (వీసీఆర్)ను మాన్యువల్‌గా నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా ఎకువ వాహనాలను తనిఖీ చేయలేకపోతున్నారు. ఈ సమస్యకు తెరదించేందుకు ట్యాబ్ (హ్యాండ్‌హెల్డ్ డివైజ్)లను కొనుగోలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఒకో ట్యాబ్‌కు రూ.1.5 లక్షలు చొప్పున మొత్తం రూ.5.6 కోట్లతో 375 ట్యాబ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.