ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. చెప్పిన తేదీన ఒకే రోజు 1,12,843 మందికి తలా రెండువేల రూపాయల చొప్పున.. మొత్తం రూ.22,56,86,000 నగదు సహాయం అందింది. మిగిలిన వారికి బుధవారం నగదు సహాయాన్ని జమ చేయడమే కాకుండా తలా 25 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయనున్నది
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి.. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. చెప్పిన తేదీన ఒకే రోజు 1,12,843 మందికి తలా రెండు వేల చొప్పున.. మొత్తం రూ.22,56,86,000 నగదు సహాయం అందింది. కరోనా కష్టకాలంలో ప్రైవేటు పాఠశాలలు తగిన విధంగా నడవకపోవడం, నడిచినా.. అందులో టీచర్లు, సిబ్బందికి తగిన వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వారికి ఆపత్కాల సహాయం కింద రెండు వేల రూపాయల నగదు, తలా పాతిక కిలోల సన్నబియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం వేగంగా పూర్తిచేసింది. అంతేకాకుండా.. చెప్పిన రోజుకు నగదును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. నగదు సహాయం అకౌంట్లలో పడినట్టు లబ్ధిదారుల ఫోన్లకు మంగళవారం టింగ్.. టింగ్.. మంటూ మేసేజ్లు అందడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మిగిలినవారికి కూడా బుధవారం నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు బుధవారం నుంచే 25 కిలోల సన్నబియ్యం పంపిణీకి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1.13 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీచేస్తారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ జిల్లాలవారీగా ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యాన్ని సిద్ధంచేసింది. పౌరసరఫరాలశాఖకు అందిన లెక్కల ప్రకారం 1,13,587 మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికోసం ఏప్రిల్ నెలకు అవసరమైన 28,39,675 కిలోల బియ్యాన్ని అందుబాటులో ఉంచారు. ఉచిత బియ్యం పంపిణీకి అవసరమైన రూ.15.15 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం మంగళవారం విడుదలచేసింది. బుధవారం నుంచి ఈ నెల 25 వరకు ఐదు రోజులపాటు సన్నబియ్యం పంపిణీ చేస్తారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటూ ప్రైవేటు టీచర్లు, ఇతర సిబ్బంది సంతోషం వ్యక్తంచేస్తున్నారు.